కరోనాతో క్రికెట్ షెడ్యూల్ గందరగోళం

60

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడారంగం కుదేలయ్యింది. క్రికెట్ మ్యాచ్‌లు కూడా భారీ సంఖ్యలో రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగింది. డబ్బున్న క్రికెట్ బోర్డులు బయోబబుల్ ఏర్పాటు చేసి ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించాయి. కానీ చిన్న బోర్డులకు మాత్రం కరోనా ప్రభావం తీవ్రంగా కనిపించింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో దాదాపు 150 రోజుల అంతర్జాతీయ క్రికెట్ తుడిచి పెట్టుకొని పోయినట్లు ఒక నివేదిక పేర్కొన్నది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు కావడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆర్దికంగా నష్టాల పాలయ్యాయి. ఐసీసీ ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఆసియా కప్ టీ20 టోర్నీ రెండు సార్లు వాయిదా పడింది. దీంతో ఐసీసీతో పాటు ఏసీసీ కూడా ఆర్దిక కష్టాలు పడాల్సి వస్తున్నది. ఒక్క బీసీసీఐ తప్ప అన్ని దేశాల క్రికెట్ బోర్డుల క్రికెట్ మ్యాచ్‌ల వాయిదా కారణంగా ఆర్దికంగా నష్టపోయినట్లు తెలుస్తున్నది.

బీసీసీఐ తప్ప..

అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డుగా పేరు తెచ్చుకున్న బీసీసీఐ తప్ప మిగిలిన బోర్డులు అన్నీ నష్టాలపాలయ్యాయి. టీమ్ ఇండియా ఆడాల్సిన దక్షిణాఫ్రికా, శ్రీలంక ద్వైపాక్షిక పర్యటనలు రద్దయ్యాయి. కానీ, కరోనా కష్టకాలంలోనూ గత ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించడం ద్వారా భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకున్నది. దీంతో బీసీసీఐ ఆదాయంపై కరోనా ప్రభావం పెద్దగా పడలేదు. అదే సమయంలో ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా రూ. 100 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇక ధనిక బోర్డులైన క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు ఆర్దికంగా సతమతమయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా ఏకంగా 70 శాతం మేర ఉద్యోగులను కాస్ట్ కటింగ్ పేరిట తొలగించింది. అంతే కాకుండా మిగిలిన 30 శాతం మంది సిబ్బందితో పాటు ఆటగాళ్ల జీతభత్యాల్లో కూడా కోత విధించింది. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 200 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. డబ్బున్న ఈ రెండు బోర్డులే నష్టాలల్లో ఉంటే ఇక క్రికెట్ సౌతాఫ్రికా, క్రికెట్ వెస్టిండీస్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్, బంగ్లాదేశ్ క్రికెట్ అప్పుల్లో కూరుకొని పోయాయి. గత 12 నెలల్లో 15 అంతర్జాతీయ సిరీస్‌లు వాయిదా పడినట్లు తెలుస్తున్నది. ఆయా క్రికెట్ బోర్డులు గత ఏడాది కేవలం 30 శాతం మేర ఎఫ్‌టీపీ మాత్రమే పూర్తి చేయగలిగాయి.

మరోవైపు మహిళా క్రికెట్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. గత కొన్ని నెలలుగా ద్వైపాక్షిక సిరీస్‌లు అసలు జరగడం లేదు. కేవలం ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య బీసీసీఐ ఒక పరిమిత ఓవర్ల సిరీస్ ఏర్పాటు చేసింది. అది మినహా ఏ మహిళా జట్టు కూడా విదేశీ పర్యటనలకు వెళ్లలేదు. అందే కాకుండా ఈ ఏడాది జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ కూడా ఏడాది వాయిదా పడటంతోమహిళా క్రికెట్‌కు తీరని నష్టం చేకూరింది.

గత 12 నెలల్లో రద్దయిన, వాయిదా పడిన పురుషుల క్రికెట్ సిరీస్‌లు

శ్రీలంక – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ (వాయిదా)
ఇండియా – దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ (రద్దు)
పాకిస్తాన్ – బంగ్లాదేశ్ (వాయిదా)
ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ (రద్దు)
శ్రీలంక – దక్షిణాఫ్రికా వన్డే, టీ20 సిరీస్ (రద్దు)
బంగ్లాదేశ్ – న్యూజీలాండ్ టెస్ట్ సిరీస్ (రద్దు)
పాకిస్తాన్ సూపర్ లీగ్ (వాయిదా)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (ఆస్ట్రేలియా రద్దు)
ఆసియా కప్ టీ20 సిరీస్ (వాయిదా)
ఆఫ్గనిస్తాన్ – జింబాబ్వే (వాయిదా)
దక్షిణాఫ్రికా – ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ (రద్దు)

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..