భారత చరిత్రలో మారణకాండ.. 26/11 టెర్రర్ అటాక్‌కు 13 ఏండ్లు

403

దిశ, వెబ్‌డెస్క్: 26/11 ఈ పేరు వింటేనే‌ ముంబైలో జరిగిన ఉగ్రదాడి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. నేటికీ సరిగ్గా 13 ఏళ్లు గడుస్తున్న ఆ మారణకాండ ఇంకా కండ్ల ముందే కనబడుతోంది. 10 మంది టెర్రరిస్టుల విచ్చలవిడి కాల్పులతో ముంబై వాసులు ప్రాణ భయంతో పరుగులు పెట్టించిన సన్నివేశాలు కోకొల్లాలు. ఇది జరిగి 13 ఏండ్లు అవుతున్నా ప్రపంచం ఈ మారణకాండను ఇంకా‌ మరిచిపోలేదు. అసలు 2008లో ఏం జరిగిందంటే..?

నవంబర్ 26, 2008న దాదాపు 10 మంది ఉగ్రవాదులు(పాకిస్తాన్ జీహాదీలు) సముద్ర మార్గం ద్వారా ముంబై నగరంలో చొరబడి భీకర కాల్పులు, బాంబు దాడులు చేశారు. ఇందులో ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ టెర్మినస్ (రైల్వేస్టేషన్), ఒబెరాయ్ ట్రైడెంట్, ద తాజ్ మహల్ ప్యాలెస్, లియోపార్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హోస్(యూదుల ప్రార్థన స్థలం), మెట్రో సినిమా హాల్, సెయింట్ జేవియర్స్ కాలేజీ, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక గల్లీలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్‌, విలే పార్లేలో ఒక టాక్సీలో పేలుళ్లు జరిగాయి. మూడు రోజుల పాటు(నవంబర్ 29వరకు) జరిగిన ఈ మారణకాండలో 173 మంది చనిపోయారు. మరో 308 మంది తీవ్రంగా గాయపడ్డారు.

లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులే..

2008 నాటి ఉగ్రదాడిలో కీలక పాత్ర వహించింది పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా సంస్థ. పాకిస్తాన్ కరాచీలో అన్ని ఆయుధాలు, పరికరాలు ఏర్పాటు చేసుకుని ఓ బోట్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత సముద్ర మార్గం గుండా ముంబైకి వచ్చారు. ఈ ఉగ్రదాడిలో ముహమ్మద్ అమ్జాద్ ఖాన్, అబ్దుల్ షకూర్, ముహమ్మద్ ఉస్మాన్, అతీక్-ఉర్-రెహ్మాన్, రియాజ్ అహ్మద్, ముహమ్మద్ ముష్తాక్, ముహమ్మద్ నయీమ్, ముహమ్మద్ ఉస్మాన్, షకీల్ అహ్మద్, ముహమ్మద్ ఉస్మాన్ జియా, ముహమ్మద్ అబ్బాస్ నాసిర్, జావేద్ ఇక్బాల్‌, ఇఫ్తీఖర్ అలీ, షాహిద్ గఫూర్, ముహమ్మద్ సబీర్ సల్ఫీ, అబ్దుల్ రెహ్మాన్‌లు ఉన్నారు.

అమర వీరులకు వందనం..

ఉగ్రదాడిని అడ్డుకునేందుకు భారత సైనికులు వీరోచిత పోరాటం చేశారు. ముఖ్యంగా తాజ్‌ హోటల్‌లో తలదాచుకున్న టెర్రరిస్టుల ఏరివేత పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏటీఎస్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అడిషనల్ పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే సహా 18 మంది పోలీసు అధికారులు మృతి చెందారు, యావత్ భారత్ దేశాన్ని ఈ ఘటన కలచివేసింది. ఈ ఉగ్రదాడి జరిగి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం(నేడు) ప్రాణాలు అర్పించిన అమర వీరులకు మహారాష్ట్ర ప్రభుత్వం నివాళులు అర్పించనుంది. దక్షిణ ముంబైలోని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు ఉగ్రదాడిని గుర్తు చేస్తూ.. అమరులకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..