- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాములో రాములా.. నీ నిధులు ఎమాయెరో !
<p>దిశ, ఖమ్మం ప్రతినిధి: ‘‘భద్రగిరి.. తెలంగాణ రాష్ట్రానికే మకుటం లాంటిది.. స్వయంగా రాముడు నడయాడిన నేలను, గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.. ఇక సుందర భద్రాద్రికి అడుగులు పడినట్టే.. భద్రాద్రి ఆలయంతో పాటు, పరిసరాలు, పర్ణశాల, నదీ పుష్కరిణి, మాఢ వీధులు, భద్రాచలం పట్టణం.. ఇలా మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం.. యాదాద్రి తరహాలో ఇక భద్రాద్రి కూడా ఉండబోతుంది.. అందుకే రూ. 100కోట్లతో అభివద్ధి పనులు చేపడతాం..’’ అంటూ 2016లో నవమి ఉత్సవాల సందర్భంగా సీఎం […]</p>

దిశ, ఖమ్మం ప్రతినిధి: ‘‘భద్రగిరి.. తెలంగాణ రాష్ట్రానికే మకుటం లాంటిది.. స్వయంగా రాముడు నడయాడిన నేలను, గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.. ఇక సుందర భద్రాద్రికి అడుగులు పడినట్టే.. భద్రాద్రి ఆలయంతో పాటు, పరిసరాలు, పర్ణశాల, నదీ పుష్కరిణి, మాఢ వీధులు, భద్రాచలం పట్టణం.. ఇలా మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం.. యాదాద్రి తరహాలో ఇక భద్రాద్రి కూడా ఉండబోతుంది.. అందుకే రూ. 100కోట్లతో అభివద్ధి పనులు చేపడతాం..’’ అంటూ 2016లో నవమి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మాటిచ్చాక దానికి సంబంధించి కొంత కసరత్తు చకచకా జరిగిపోయింది. డిజైనింగ్ కూడా పూర్తి చేసినట్టే చేశారు. మాస్టర్ ప్లాన్ తుదిదశకు చేరుకుందని, అందరూ దాని గురించి కొంత కాలం హడావుడి చేశారు. సీఎం ఆమోద ముద్ర వేయగానే నిధులు విడుదలవుతాయని, ఇక పనులు స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. ప్రజలంతా నిజంగానే అభివృద్ధి పనులు జరుగుతాయేమో అని అనుకున్నారు. ఇక సుందర భద్రగిరిలో అందమైన రామయ్యను చూసి తరించొచ్చని కలలు కన్నారు. కానీ ఉన్నట్టుండి హడావుడి ఆగిపోయింది. ప్రముఖుల పర్యటనలు, పరిశీలనలు, చర్చలు ఆగిపోయాయి. అసలిప్పుడు సుందర భద్రాద్రి ఊసే లేదు. సోమవారం నుంచి భద్రాచలంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రికి చేరుకుంటున్న భక్తులు ‘ఏదీ సుందర భద్రగిరి.. ఏమయ్యాయి.. రూ. 100కోట్ల నిధులని’ చర్చించుకుంటున్నారు.
పుణ్యక్షేత్రమే కాదు.. పుణ్య తీర్థం కూడా..
భద్రుని కొండ.. భక్తులకు అండగ.. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం మహా పుణ్యక్షేత్రమే కాదు, పుణ్యతీర్థం కూడా.. ప్రతి ఏటా భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలతో పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలూ అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఆ వేడుకలను దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా వస్తుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం రామయ్య పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను కూడా సమర్పించడం ఆనవాయితీ. భద్రాచల పుణ్యక్షేత్రం అంటేనే ఓ అద్భుతమైన ప్రదేశం. ఆలయ చుట్టు పక్కల ప్రాంతాలు, పర్ణశాలను చూస్తుంటే మైమరచిపోవచ్చు. గోదారి తీరంలోని కరకట్టపై రామాయణ సన్నివేశాలు కళ్లకు కట్టినట్టుగా రసరమ్యంగా ఉంటాయి. ఇక రామయ్య పెళ్లి జరిగే మిథిలా ప్రాంగణలోని కల్యాణ మండపం ఆసాంతం శిల్పకళా శోభితంగా ఉంటుంది. ప్రధాన వేడుకలప్పుడే కాకుండా సాధారణ రోజుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రామయ్యను దర్శించుకుంటారు. ఇంతటి విశిష్టత కల్గిన భద్రగిరిని గత పాలకులు నిజంగానే విస్మరించారు. అందుకే ఇక్కడకు వచ్చే భక్తులు సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలనే సీఎం కేసీఆర్ 2016లో నవమి ఉత్సవాలకు వచ్చిన సందర్భంగా భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతామని, దానికోసం రూ. 100 కోట్లు కేటాయించినట్లు మాటిచ్చారు.. ఆ తర్వాత మరిచిపోయారు..
హడావుడి ఏమైంది..
రూ. 100 కోట్లతో భద్రాద్రి రూపురేఖలే మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన అనంతరం కొన్ని నెలల పాటు హడావుడి బాగానే జరిగింది. ప్రముఖులు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించేవారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని చర్చించేవారు. పలుమార్లు సీఎం కేసీఆర్ ఆహ్మానం మేరకు చిన్నజీయర్ స్వామి కూడా వచ్చి సుందర భద్రాద్రి నిర్మాణానికి పాల్పంచుకున్నారు. నిర్మాణానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి కూడా భద్రాద్రి వచ్చి దేవాలయ అభివృద్ధిపై కసరత్తు చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి పునర్నిర్మాణానికి సంబంధించి చర్చలు జరపడం, నివేదికలు సమర్పించడం దగ్గరుండి చేశారు. అద్భుతమైన డిజైన్ తో మొత్తంగా చివరి మాస్టర్ ప్లాన్ రెడీ చేసి సీఎం టేబుల్ పై ఉంచామని.., ఆయన ఆమోదించగానే రూ . 100 కోట్లు విడుదలవుతాయని.. వెంటనే పనులు మొదలు పెడతామని కూడా ప్రకటించారు. అంతే ఏమైందో ఏమోగానీ ఉన్నట్టుండి సుందర భద్రాద్రి పనులు ఆగిపోయాయి. ప్రముఖుల పర్యటనలు, పరిశీలనలు, మీటింగ్ లు అన్నీ ఆగిపోయాయి.. రూ. 100కోట్ల మాట ఎవ్వరినోటా వినపడలేదు.. దాదాపు నాలుగు సంవత్సరాలు కావొస్తున్నా పునర్నిర్మాణానికి సంబంధించి పనులు ఇంత వరకూ మొదలు కాలేదు. అసలు ఆ ఊసే లేదు. స్థానిక అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు చిన్నచిన్న మార్పులు చేసుకుంటున్నారే తప్ప అసలు భద్రగిరి పునర్నిర్నాణం మాత్రం ఆగిపోయింది..
రెండు ప్రాకారాలతో ఆలయ నిర్మాణం ఏమైంది..?
రామాలయాన్ని నిర్మించిన రామదాసు (కంచర్ల గోపన్న) డ్రీమ్స్ చెక్కు చెదరకుండానే సుందర భద్రాద్రికి తుది రూపు నిచ్చారు. ఆయన కట్టించిన విధంగానే రామాలయం గర్భగుడి, రాజగోపురం యథాతథంగానే ఉంచుతూ ఆలయం చుట్టూ రెండు ప్రాకారాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. మొదటి ప్రాకారాన్ని రాతితో 20 అడుగుల ఎత్తుతో, రెండో ప్రాకారాన్ని 50 అడుగులతో నిర్మాణం చేయనున్నట్లు మాస్టర్ ప్లాన్ నివేదికలో పొందుపరిచారు. మాఢ వీధులను కూడా 40 అడుగుల మేర విస్తరించనున్నట్లు చర్చించుకున్నారు. పూర్తిగా ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించే విధంగా ఆర్కిటెక్ట్ ఆనందసాయి తుది నిర్మాణాన్ని రూపొందించారు. ఇక రామాలయం నుంచి గోదావరి కరకట్ట వరకు సులువుగా వెళ్లేందుకు కింది భాగం నుంచే మెట్లు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసుకున్నారు.
105 అడుగుల శ్రీరామ స్థూపాన్ని ఎప్పుడు నిర్మిస్తారు..?
సుందర భద్రగిరిలో రామాయణ రసరమ్య దృశ్యాలు ఉట్టిపడేలా ప్రాకారం చుట్టూ అద్భుతమైన కళాఖండాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. భక్తులు ఎటు నుంచి చూసినా గుడి అందంగా కన్పించేలా, కొండపైన భద్రాద్రి రామయ్య దర్శనమిచ్చేలా ఆలయాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మొత్తంగా కంచర్ల గోపన్న డిజైన్ ఏమాత్రం చెదరకుండా నిర్మాణం చేయాలనుకున్నారు. ఇక ఆలయ ఆవరణలోనే పుష్కరిణి కూడా ఏర్పాటు చేద్దామనుకున్నా.. ఆ తర్వాత మాత్రం గోదారి నది పక్కన నిర్మించేలా ప్లాన్ చేసుకున్నారు. అంతేకాదు ఈ పుష్కరిణి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఇంకా చెప్పాలంటే భద్రాద్రి క్షేత్రం ప్రాధాన్యత దృష్ట్యా.. భక్తుల సౌకర్యార్థం 105 అడుగుల ఎత్తులో శ్రీరామ భారీ స్థూపం ఆలయ సమీపంలో ఏర్పాటు చేయనున్నట్టు చర్చ కూడా జరిగింది. ఇక ఈ స్థూపం పైనే రామకోటి రాసుకునే విధంగా నిర్మించాలనుకున్నారట… మరి ఏమైందో కానీ ఇప్పుటి వరకు ఆ అద్భుత మైన ప్లాన్ అమలు కాలేదు..
పేపర్ల మీదేనా రూ. 100కోట్ల సెట్టింగులు..
తుది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ నిర్మాణం చేపడితే నిజంగానే అత్యద్భుతమైన భద్రాద్రిగా మారుతుంది. రెండు ప్రాకారాలతో దేవస్థానం అత్యంత వైభవోపేతంగా దర్శనమిస్తుంది. కరకట్ట అందాలు వీక్షించేందుకు ఇప్పటికే భక్తులు ముచ్చటపడుతుంటారు. ఇక నూతన నమూనా ప్రకారం రామాయణ ఇతివృత్తాలను కళ్లకు కట్టేవిధంగా మరింత అందంగా మలిచేవారు. అంతేకాదు.. దేవస్థానం పరసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా వెలుగొందేవి. ఇక ఎత్తైన శ్రీరామ స్థూపం భద్రగిరికే వన్నె తెచ్చేది. నవీకరించిన పర్ణశాల అందాలూ భక్తులను మైమరచి పోయేలా చేసేవి. మొత్తంగా ఒక్కసారి భద్రాచలం వచ్చిన భక్తులకు అక్కడే చిరకాలం ఉండిపోయేలా.. ఆధ్యాత్మిక చింతనతో మనసు పరితపించేలా ఉండేది.. మరి ఆ రూ. 100 కోట్ల సెట్టింగులన్నీ కాగితాల మీదేనా..? లేక నిజరూపం దాల్చుతాయో చూడాలి మరి..
‘నయా దేవరాయ’ ఇచ్చిన మాట మరిచారా..?!
భద్రాద్రి ఆలయం మరింత అందంగా రూపుదిద్దుకోనుందని.. భద్రాద్రి ఆలయ సృష్టికర్త భక్తరామదాసు కలలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి జరగబోతుందని.. ఎటు చూసినా ఆలయం అందంగా కనిపించేలా నిర్మాణం జరుగుతుందని భద్రాద్రి ఆలయ అభివృద్ధి శిల్పి, ఆర్కిటెక్ట్ ఆనందసాయి నూతన నమూనా గురించి అప్పుడు భద్రాచలంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. ఆలయం అత్యంత శోభాయమానంగా కొండపైనే ఉన్నట్టుగా కనిపిస్తుందని కూడా చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ ను శ్రీ కృష్ణ దేవరాయలుగా కూడా అభివర్ణించారు. కేసీఆర్ రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి పరుస్తున్న మాట వాస్తవమయినప్పటికీ భద్రాచలం దేవస్థానం విషయంలో ఎందుకిలా జరిగిందని స్థానికులు, భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిధులు కేటాయించడమే కాకుండా సీఎం కేసీఆర్ వారం రోజులు పాటు ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తానని, అవసరమైనే ఇంటింటికీ తిరుగుతానన్న మాటలను సైతం గుర్తు చేసుకుంటున్నారు.. వారం రోజులు కాదుకదా నాలుగేళ్లయినా కన్నెత్తి చూడలేదని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ అభివృద్ధి పనుల్లో పురోగతి లేకపోవడంతో ‘నయా దేవరాయ’ ఇచ్చిన మాట మార్చారా..? లేక మరిచారా? అంటూ చర్చించుకుంటున్నారు.
ఇంతకీ సుందర భద్రగిరికి మోక్షం కలిగేనా..?
నిజంగానే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు సీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి బాటపడుతున్నాయి. ప్రముఖ దేవాలయాలన్నింటికీ నిధులు కేటాయించి అందంగా తీర్చిదిద్దుతున్నారు. తిరుపతిని తలపించేలా యాదాద్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సుందరంగా యాదాద్రి తయారై భక్తులకు కనువిందు చేయనుంది. మరి భద్రాచలం దేవస్థానం విషయంలో ఎందుకిలా జరుగుతోందంటూ భక్తులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం అభివృద్ధి జరిగితేనే బాగుంటుందని మాఢవీధుల విస్తరణకు సైతం ఒప్పుకున్నామని స్థానికులు, నిర్వాసితులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాటిచ్చి నాలుగైదేండ్లు కావస్తున్నా.. మాస్టర్ ప్లాన్ రూపొందించడం మినహా దాని అమలు మాత్రం జరగడం లేదంటున్నారు.. ఇంతకీ సుందర భద్రాద్రికి ఇకనైనా మోక్షం కలిగేనా..? అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు.
ముక్కోటి నేపథ్యంలో భక్తుల చర్చ..
నిన్నటి (సోమవారం) నుంచి భద్రాచలంలో ముక్కోటి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 21 రోజుల పాటు అంటే జనవరి 4వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.. ఈ నెల 24న తెప్పోత్సవం, 25న ఉత్తరద్వార దర్శన మహాఘట్టాలు జరుగనున్నాయి. భక్తులు ఉత్సవాలను వీక్షించేందుకు ఇప్పటినుంచే భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాలు పెట్టగానే ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రూ. 100 కోట్ల నిధులు కేటాయించి సుందర భద్రాద్రికి అడుగులు వేయాలని కోరుతున్నారు..
ఇకనైనా నిధులు కేటాయించాలి..
-తిప్పన సిద్దులు, టీఆర్ఎస్ నాయకుడు, భద్రాచలం
కేసీఆర్ నాలుగు సంవత్సరాల క్రితం భద్రాద్రి అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని మాటిచ్చారు. వాస్తవానికి ఈ ప్రాంతానికి రూ.500 కోట్లు కేటాయించాలి.. కానీ ఇప్పటి వరకు కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంత వరకు ఇక్కడ ఎలాంటి పనులూ మొదలు కాలేదు.. భక్తులు నిధులు కేటాయించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నమాట వాస్తవమే.. కేంద్రం కూడా రూ. 50కోట్లు ఇస్తానని ఇవ్వలేదు. ఇకనైనా భద్రాద్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలి.
ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోవడం లేదు..
– భాస్కరుని రాధా కృష్ణ శాస్త్రి, పురోహితుడు, రామాలయం
దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క రామక్షేత్రం భద్రాచలం. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం ప్రస్తుతం రాజకీయ సుడిగుండంలో మునిగి పట్టించుకునే నాథుడే లేక అనాథగా మిగిలిపోయే పరిస్థితి దాపురించింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా భద్రాచలం పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భద్రాచలాన్ని ఎన్ని వందల కోట్లయినా ఖర్చుపెట్టి అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పి, రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. కేటాయిస్తానన్న రూ. 100కోట్లకు ఇప్పటి వరకు దిక్కులేదు. ఆంధ్రాలో కలిసిన మండలాలను, చివరకు భద్రాచలం పట్టణంలో ఉన్న కాలనీలు సైతం ఆంధ్రాలోకి పోయినా వాటిని తిరిగి తీసుకు రావడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు.
ఆలస్యమైన మాట వాస్తవమే..
-మానె రామకష్ణ, భద్రాచలం పట్టణ మాజీ టీఆర్ఎస్ అధ్యక్షుడు
భద్రాద్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. రూ. 100కోట్లు కేటాయించి ఆలయాన్ని అతి త్వరలోనే తీర్చిదిద్దుతారు. దీనికి సంబంధించి అన్ని ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. త్వరలోనే ఈ ప్రాంత వాసుల కల నెరవేరుతుంది. కొన్ని స్థానిక సమస్యల వల్ల కొంత ఆలస్యమైన మాట వాస్తవమే.. ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఇప్పటికే ఆలయ పునర్నిర్మాణానికి తుదిరూపు ఇచ్చారు. యాదాద్రి తరహాలో భద్రాద్రి కూడా రూపుదిద్దుకోనుంది. పువ్వాడ అజయ్ నేతృత్వంలో అతిత్వరలోనే అభివృద్ధి పనులు చేపడతాం.






