నేటి నుంచే బ్యాంకుల విలీనం..తెలుసుకోవాల్సిన అంశాలు!

by  |

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ అధీనంలోని పది బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. విలీనం కాబోయే బ్యాంకులు విలీనం చేసుకున్న బ్యాంకులకు బ్రాంచులుగా పని చేయనున్నాయి. బ్యాంకుల విలీన ప్రక్రియ గతేడాది ఆగష్టులో కేంద్రం ప్రకటించింది. దీనికి మార్చి 4న కేంద్ర మంత్రి వర్గం తుది ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విలీన ప్రక్రియ కొన్నాళ్లు వాయిదా వేయాలని బ్యాంకుల సంఘాలు అభ్యర్థించినప్పటికీ బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఏప్రిల్ 1 నుంచి యధావిధిగా విలీనం అమలవుతుందని స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం దృష్టి పెడుతున్న సమయంలో విలీన ప్రక్రియ సున్నితంగా పరిశీలించాల్సిన అంశం. అయితే, యాంకర్ బ్యాంకుల అధికారులు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. ‘ప్రణాళిక ప్రకారం జరిగితే కొత్త సమస్యలు పుట్టవు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమీక్ష జరుపుతాము. అమలు జరిగే విధానంలో కొన్ని మార్పులుంటాయి. ఉద్యోగులు, వినియోగదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటాం’ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ వివరించారు.

విలీనం చేసుకుంటున్న యాంకర్ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు విలీనం అమలులో కొంత భాగాన్ని వాయిదా వేస్తున్నాయి. బ్యాంకుల రుణ ప్రక్రియలో మార్పులు చేయలేదు. వీటితో పాటు కొన్ని అంతర్గత అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తీస్థాయి విలీనం జరుపుతామని రాజ్‌కిరణ్ పేర్కొన్నారు.

గతంలోనూ అనేక బ్యాంకుల విలీనం ప్రక్రియలు జరిగాయి. 2017లో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అనుబంధ బ్యాంకులనూ, భారతీయ మహిళా బ్యాంకునూ విలీనం చేసుకుంది. గతేడాది విజయ బ్యాంకు, దేనా బ్యంకులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయబడ్డాయి. అలాగే, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో 2014లో విలీనం కాగా, సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ లిమిటెడ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 2008లో విలీనం చేయబడింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే :

1. తాజా విలీనం ప్రకారం.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అవుతాయి. ఈ విలీనం ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మారనుంది. ఈ బ్యాంకు మొత్తం వ్యాపార విలువ రూ. 17.95 లక్షల కోట్లతో 11,437 శాఖలను కలిగి ఉంటుంది.

2. సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకుతో కలపడం ద్వారా రూ. 15.20 లక్షల కోట్ల వ్యాపార సంస్థగా కెనరా బ్యాంకు మారనుంది. 10,324 శాఖలతో నాల్గవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉండనుంది.

3. అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకుతో విలీనం చేయనున్నారు. దీంతో ఇండియన్ బ్యాంకు విలువ రూ. 8.08 లక్షల కోట్ల వ్యాపారంతో ఏడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అవనుంది.

4. ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలుగా పనిచేయనున్నాయి. ఈ విలీనంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 14.59 లక్షల కోట్ల వ్యాపారంతో ఇండియాలో ఐదవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా, 9,609 శాఖలను కలిగి ఉంటుంది.

5. ఈ బ్యాంకుల విలీన ప్రక్రియ సజావుగా జరగడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 68,855 కోట్ల రూపాయలను వెచ్చించింది.

6. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 16,091 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 11,768 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ. 6,571 కోట్లు, ఇండియన్ బ్యాంకుకు రూ. 2,534 కోట్లు ఇవ్వడం జరిగింది. అలహాబాద్ బ్యాంకుకు రూ. 2,153 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 1,666 కోట్లు, ఆంధ్రా బ్యాంకుకు రూ. 200 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ. 4,360 కోట్లు, యూకో బ్యాంకుకు రూ. 2,142 కోట్లు అందించారు.

7. ఈ మెగా విలీనంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 2017లో 27 ఉండగా, 2020 ఏడాది నుంచి 12 బ్యాంకులకు తగ్గనున్నాయి.

Next Story

Most Viewed