జొమాటోకు రాజీనామా చేసిన సహ-వ్యవస్థాపకుడు గౌరవ్ గుప్తా!

by  |
Gaurav Gupta
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సహ-వ్యవస్థాపకుడు, సరఫరా విభాగం హెడ్ గౌరవ్ గుప్తా సంస్థ నుంచి తప్పుకున్నారు. దీనికి సంబంధించి గౌరవ్ గుప్తా స్పష్టత ఇచ్చారు. ‘ నా జీవితంలో కొత్త నిర్ణయాన్ని తీసుకుంటున్నాను. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను. గత ఆరేళ్లుగా జొమాటోతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నానని’ గౌరవ్ గుప్తా ఓ మెయిల్‌లో పేర్కొన్నారు. సంస్థ సీఈఓ దీపిందర్ గోయెల్ కూడా ట్విటర్ ద్వారా ఆయన స్నేహాన్ని గుర్తుచేసుకుని, భవిష్యత్తులో స్నేహితులుగా కొనసాగుదామని చెప్పారు. జొమాటో సంస్థలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా ఉన్న గౌరవ్ గుప్తా సంస్థ నుంచి వెళ్లిపోవడం ఫుడ్‌టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

గౌరవ్ గుప్తా 2015లో జొమాటో సంస్థలో చేరారు. అనంతరం 2018లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా, 2019లో ఫౌండర్‌గా మారారు. అంతేకాకుండా జొమాటో సంస్థ ఐపీఓకు రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సంస్థ ఐపీఓ కోసం పెట్టుబడిదారులతో పాటు మీడియాతో మాట్లాడింది గౌరవ్ గుప్తానే. ఇటీవల జొమాటో సంస్థ కిరాణా డెలివరీ సేవలను నిలిపేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు న్యూట్రాస్యూటికల్ వ్యాపారాన్ని కూడా నిలిపేసింది. గతేడాదిలోనే జొమాటో సంస్థ ఈ వ్యాపారంలోకి ప్రవేశించింది. ప్రభుత్వం ప్రైవేట్ లేబుల్ నిబంధనలపై కఠిన నిబంధనలకు సిద్ధమైన సమయంలో సంస్థ ఈ వ్యాపారాలను కూడా మూసేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గౌరవ్ గుప్తా నిష్క్రమణ ఆసక్తికరం. మంగళవారం దీనికి సంబంధించి దీపిందర్ గోయెల్ ట్విటర్ ద్వారా స్పష్టత ఇవ్వడంతో జొమాటో షేర్లు 5 శాతం క్షీణించి ఇంట్రాడే కనిష్ఠ స్థాయి రూ. 136.20 వద్ద ట్రేడయింది.


Next Story