షర్మిల సభకు వెయ్యి కార్లు, కీలక వ్యక్తులు

by  |
షర్మిల సభకు వెయ్యి కార్లు, కీలక వ్యక్తులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపన చేస్తానని ముందడుగు వేసిన షర్మిల.., తాను ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో ఖమ్మం జిల్లాలో 9వ తేదీన నిర్వహించే ‘సంకల్ప సభ’లో ప్రజలకు తెలియజేయనున్నారు. ఈ మేరకు లోటస్ పాండ్ నుంచి సుమారు వెయ్యి కార్లతో ర్యాలీగా ఖమ్మం జిల్లాకు తన తల్లి విజయమ్మతో కలిసి రానున్నారు. విజయమ్మతో పాటు షర్మిల పినతల్లి భారతి కూడా సభకు వచ్చేఅవకాశముంది. తెలంగాణలో పార్టీ పెడతానని సంచలనం సృష్టించిన షర్మిల ఈ సభలో ఏయే అంశాలను లేవనెత్తుతారనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పలుచోట్ల అభిమానులు బైక్ ర్యాలీలు కూడా నిర్వహించనున్నారు.

ఫోకస్ అంతా విజయమ్మ మీదే..

ఖమ్మంలో నిర్వహించే సభకు విజయమ్మ వస్తారా? లేదా అనే సందిగ్ధతకు షర్మిల కార్యాలయవర్గం తెరదించింది. విజయమ్మ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేసింది. ఇటీవల ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసిన విజయమ్మ తన కుమారుడు జగన్, షర్మిలకు మధ్య అభిప్రాయ బేధాలే తప్ప విభేదాలు కావని స్పష్టం చేసింది. షర్మిల కూడా తన రాజకీయ భవిష్యత్ తెలంగాణలో ఉందని బలంగా నమ్మిందని, ఓదార్పుయాత్ర, పాదయాత్రల ద్వారా తెలంగాణ ప్రజలతో ఆమెకు ఏర్పడిన అనుబంధం
కోసం ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ముందడుగు వేస్తోందని ఆ లేఖలో విజయమ్మ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలిలా ఉన్న విజయమ్మ ఈ సభకు తల్లిగా హాజరై షర్మిలను ఆశీర్వదించుతారని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల కూడా ఈ సభలో తన తల్లి ఉండాలని కోరినట్లు వారు పేర్కొన్నారు. తద్వారా కుటుంబ మద్దతు తనకుందని ప్రజలకు చాటిచెప్పనున్నట్లు అవుతుందని ఆమె భావిస్తున్నారు. తెలంగాణలో షర్మిల నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఈ సభలో విజయమ్మ ఏయే అంశాలను ప్రస్తావించనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వేదికపై ముఖ్య నేతలకే చోటు

ఖమ్మం జిల్లా పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించే సభలో వంద మంది ముఖ్య నేతలకు చోటు దక్కే అవకావశముంది. సభా ప్రాంగణం కాస్త చిన్నదిగా ఉండటంతో పాటు కొవిడ్ నేపథ్యంలో 5 వేల నుంచి 6 వేల మందితోనే సభ నిర్వహించాలని పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో తక్కువ మందికే చోటివ్వాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరిని వేదిక మీదకు పిలవాలనే అంశంపై ఇప్పటికే కార్యాచరణ పూర్తయినట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇతర పార్టీల నుంచి చేరికలు?

సంకల్ప సభలో ఇతర పార్టీల నుంచి షర్మిల ఆధ్వర్యంలో చేరికలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. పార్టీ ప్రకటన నాటి నుంచి షర్మిలకు ప్రజలతో పాటు పలు పార్టీల నాయకుల మద్దతు కూడా పెరిగింది. ఇతర పార్టీల్లో సరైన ఆదరణ దక్కని వారు, మరో గత్యంతరం లేక ఒకే పార్టీలో కాలం గడుపుతున్న వారు క్రమంగా షర్మిలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కూడా తమకు టచ్ లో ఉన్నట్లు లోటస్ పాండ్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే వారు ఖమ్మం సభకు చేరుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సభలో మాత్రం ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులు చేరే అవకాశాలున్నాయి.

పాలేరు నుంచి పోటీపై స్పష్టత?

తన తండ్రి వైఎస్సార్‌కు పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగని ఆ నియోజకవర్గ ప్రజలకు షర్మిల చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పాలేరు నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పాలేరు నియోజకవర్గానికి కోడలు కావడంతో పాటు వైఎస్సార్ కు భారీగా అభిమానులున్న ప్రాంతం కావడం, వైఎస్సార్ సీపీకి చెందిన నేతలు కూడా ఎక్కువగా ఉండటం షర్మిలకు కలిసొస్తుందని అభిమానులు అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంపై షర్మిల స్పష్టత ఇస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది.



Next Story

Most Viewed