ఇల్లంతకుంట పీఎస్‌లో సంచలన ఘటన.. సంబంధం లేదంటున్న పోలీసులు(వీడియో)

by  |
ఇల్లంతకుంట పీఎస్‌లో సంచలన ఘటన.. సంబంధం లేదంటున్న పోలీసులు(వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన కలకలం సృష్టించింది. పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను చనిపోయే ముందు తన గోడు వెల్లబోసుకుంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంఘటనా వివరాల్లోకి వెళ్లితే… రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన రెబ్బల వంశీ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో మరణించాడు.

మృతుడు వంశీ చికిత్స పొందుతుండగా చెప్పిన వాంగ్మూలం మేరకు… రహీంఖాన్ పేట గ్రామానికి చెందిన తన దగ్గరి బంధువుల దగ్గర ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్లో తన చేయి ఇరుక్కుపోవడంతో వంశీ శాశ్వత అంగవైకల్యుడయ్యారు. దీంతో వంశీకి ఆర్థిక సాయంతో పాటు ఎకరం భూమి కూడా ఇస్తామని ఒప్పుకున్న వంశీ బంధువులు, ఆ తరువాత తప్పించుకున్నారు. తాను చేయి కోల్పోయి నెలలు గడుస్తున్నా తనకు ఇస్తానన్న పరిహారం ఇవ్వకపోవడంతో 15 రోజుల క్రితం సదరు ట్రాక్టర్ యజమాని ఇంటి ముందు గుడిసె వేసుకొని వంశీ తన బంధువులతో నిరసన తెలిపాడు. ఈ సమాచారం అందుకుని ఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఎస్ఐ గుడిసెను పీకేసి బెదిరింపులకు గురి చేశాడని బంధువుల ఆరోపిస్తున్నారు. అలాగే ఈ గొడవకు కారణమైన ట్రాక్టర్‌ను కూడా పోలీసులు స్టేషన్‌కు తరలించారని తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన వంశీ శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు.

ట్రాక్టర్ షిప్ట్..

అయితే వంశీ, ట్రాక్టర్ యజమానికి మధ్య జరిగిన గొడవలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ ఆదివారం 11.30 గంటల ప్రాంతంలో స్టేషన్ నుండి మరోచోటకు తరలించినట్టు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. చికిత్స పొందుతూ వంశీ మరణించాడన్న విషయం తెలిసిన వెంటనే తమ ఆధీనంలో ట్రాక్టర్ లేదని చెప్పుకునేందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా ఈ చర్యకు పూనుకున్నారని స్థానికులు అంటున్నారు.
మాకేం సంబందం లేదు: సీఐ ఉపేందర్

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రహీంఖాన్ పేటకు చెందిన వంశీ ఆత్మహత్యకు పాల్పడింది నిజమేనని అయితే ఈ ఘటనకు పోలీసులకు ఎలాంటి సంబందం లేదని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ స్పష్టం చేశారు. వంశీకి ట్రాక్టర్ యజమానికి మధ్య జరిగిన విషయం అంతా కూడా నిజమేనని అయితే ఇందులో పోలీసుల ప్రమేయం మాత్రం లేదని వెల్లడించారు.


Next Story

Most Viewed