టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తల దాడి.. పట్టాభి ఇంట్లో రచ్చ రచ్చ

by  |
టీడీపీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తల దాడి.. పట్టాభి ఇంట్లో రచ్చ రచ్చ
X

దిశ, ఏపీబ్యూరో: ఏపీ రాజకీయాల్లో గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం అగ్గిరాజేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్-టీడీపీ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గంజాయి స్మగ్లింగ్‌ను వైసీపీ నేతలు ఒక వ్యాపారంగా చేస్తున్నారంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీడీపీ ఆరోపణలపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేయోద్దంటూ హెచ్చరిస్తున్నారు. అయితే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మంగళవారం టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. గంజాయి స్మగ్లింగ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి నివాసంపై దాడికి పాల్పడ్డారు. పట్టాభి ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేశారు. మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సైతం వైసీపీ నేతలు వదల్లేదు. కేంద్ర కార్యాలయంలోకి చొచ్చుకుని వచ్చిన వైసీపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ నేత అమీర్ బాబు ఇంటి వద్ద వైసీపీ నేతల నిరసన

వైఎస్ఆర్ కడప నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జీ అమీర్ బాబు ఇంటి వద్ద వైసీపీ కార్పొరేటర్లు, నేతలు ఆందోళన చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్, అమీర్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల మాట్లాడిన అసభ్య వ్యాఖ్యలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు అమీర్‌బాబు మైనార్టీ ద్రోహి సీఎం అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీర్ బాబు క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఇంటి ముందు నుండి వెళ్ళేది లేదంటూ డిమాండ్ చేశారు. అమీర్ బాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు మోహరించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.



Next Story

Most Viewed