ఖరీదైన.. విసర్జిత ‘కాఫీ’ గింజలు

by  |
ఖరీదైన.. విసర్జిత ‘కాఫీ’ గింజలు
X

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టంట్‌ కాఫీ అయితే చిటికెలో తయారుచేయొచ్చు కానీ, కాఫీ గింజలు ఉత్పత్తికి మాత్రం చాలా సమయమే పడుతుంది. ఇక అధిక నాణ్యత గల బీన్స్, ప్రత్యేకమైన ప్రాసెసింగ్ పద్ధతులే ‘కాఫీ’కి మంచి ఫ్లేవర్‌ను తీసుకొస్తాయన్నది తెలిసిందే. కాగా ప్రత్యేకమైన రుచి, అదిరిపోయే ఘుమఘుమలతో కొన్ని రకాల కాఫీలు ప్రపంచ ప్రసిద్ది పొందగా, వాటి ధరలు కూడా అదే రేంజ్‌లో ఉండటం విశేషం. అంతేకాదు అవి పరిమాణం కంటే కూడా నాణ్యతలో ది బెస్ట్‌‌గా, మిగతా కాఫీ గింజల కన్నా భిన్నమైన కెఫిన్‌ను అందించగలవు. అందుకే అవి కాస్లియెస్ట్ కాఫీ‌ రకాలుగా నిలిచాయి. కాగా ఈ బీన్స్‌ను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, చాలా తక్కువ మొత్తంలో పండించి ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ విచిత్రమైన విశేషమేమిటంటే.. అందులో కొన్ని రకాల కాఫీ గింజలను జంతువులు, పక్షుల విసర్జితాల నుంచి ప్రాసెస్ చేస్తున్నారు.

జాకు బర్డ్ కాఫీ :

జాకు బర్డ్ కాఫీ.. ప్రపంచంలోని అరుదైన, అత్యంత ఖరీదైన కాఫీ రకాల్లో ఒకటి. జాకు పక్షులకు చెర్రీలు, కాఫీ గింజలను తినిపించి, వాటి విసర్జితాల నుంచి కాఫీ గింజలను ప్రాసెస్ చేస్తారు. అయితే ఈ కాఫీ గింజలు ప్రపంచానికి పరిచయం కావడానికి ఓ ఇంట్రెస్టింగ్ కథ ఉంది. అదేంటంటే.. బ్రెజిల్‌కు చెందిన హెన్రిక్ స్లోపర్ డి అనే వ్యక్తికి సుమారు 50 హెక్టార్లలో ‘కామోసిమ్ ఎస్టేట్’గా పిలువబడే కాఫీ తోట ఒకటుంది. కానీ కొన్నేళ్ల కిందట అతని తోటను జాకు పక్షులు ఆక్రమించాయి. ఇవి బ్రెజిల్‌లో అంతరించిపోతున్న పక్షి జాతి కాగా.. వాటికి ఎలాంటి నష్టం కలిగించవద్దని, వాటిని కాపాడాలని బ్రెజిల్ ప్రభుత్వం పిలుపునివ్వడంతో పాటు చట్టం కూడా తీసుకొచ్చింది. అదే సమయంలో అతనికో అద్భుతమైన ఆలోచన వచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీలుగా పేరుగాంచిన ‘కోపి లువాక్, బ్లాక్ ఐవరీ’ వలె ‘జాకు బర్డ్’ పూప్ నుంచి కాఫీ గింజలను ప్రాసెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు జాకు బర్డ్ పూప్‌ను కలెక్ట్ చేసేందుకు వర్కర్స్‌ను నియమించుకుని, వారికి జీతమిచ్చేవాడు. కాఫీ చెర్రీస్‌ను పూప్ నుండి చేతితో తీసిన తర్వాత ప్రాసెస్ చేసి అందించడంతో జాకు బర్డ్ కాఫీ సూపర్ టేస్టీ కాఫీగా నిలిచింది. తక్కువ సమయంలోనే దాని నాణ్యత, కొరత కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ రకాల్లో ఒకటిగా పేరుపొందగా, కిలోకు సుమారు $ 1,000కు అమ్ముడవుతోంది.

కోపి లువాక్ :

‘కోపి లువాక్’ లేదా ‘సివెట్ కాఫీ’ గింజలను ‘సివెట్ పిల్లుల’ విసర్జితాల నుంచి ప్రాసెస్ చేస్తారు. ఇందుకోసం కాఫీ గింజలను సివెట్ పిల్లులకు తినిపించగా, అవి వాటి జీర్ణవ్యవస్థలో కిణ్వన ప్రక్రియకు గురవడంతో పాటు పిల్లి కడుపులోని సహజ ఎంజైములు బీన్ రుచిని పెంచుతాయి, అందుకే ఈ కాఫీ ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన కాఫీగా దీన్ని అభివర్ణిస్తారు. దీన్ని ప్రధానంగా ఇండోనేషియాలోని జావా, బాలి, సులవేసి ద్వీపాల్లో ఉత్పత్తి చేస్తుండగా, వివిధ దేశాలకు కిలోకు రూ. 20,000-40,000 వరకు విక్రయిస్తున్నారు. గల్ఫ్ దేశాలతో పాటు ఐరోపాలోనూ ఈ కాఫీని ఇష్టంగా తాగుతుంటారు. ఇక ఇండియాలోని కూర్గ్‌లో కూడా ‘కోపి లువాక్’ కాఫీని పండిస్తుండగా, ‘ఐన్‌మనే’ బ్రాండ్‌తో విక్రయిస్తున్నారు.

బ్లాక్ ఐవరీ కాఫీ

కోపి లువాక్ మాదిరిగానే, బ్లాక్ ఐవరీ కాఫీ కూడా ఏనుగు పూప్ ద్వారా ప్రాసెస్ చేసిన కాఫీ. ఉత్తర థాయ్‌లాండ్‌లోని ఎస్టేట్‌లో పండించిన అరబికా కాఫీ గింజలను, చెర్రీలను ఏనుగులకు తినిపిస్తారు. ఏనుగుల కడుపులోని ఆమ్లాలు, ఎంజైమ్స్ కాఫీ గింజల ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి, కాఫీకి ప్రత్యేకమైన, మృదువైన రుచిని ఇస్తాయి. ఈ బ్రాండ్ ఉత్తర థాయ్‌లాండ్‌లో మాత్రమే తయారవుతుంది. దేశంలోని ప్రత్యేకమైన హై-ఎండ్ రిసార్ట్స్‌లో ఒక కప్పుకు $ 50 చొప్పున లభిస్తుంది.


Next Story