ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యం : ఎస్పీ మహేష్ బి.గితే

by Batti.Sumithra |

ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యం : ఎస్పీ మహేష్ బి.గితే
X

దిశ, తంగళ్లపల్లి : ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షితమైన, శాంతియుతమైన సమాజ నిర్మాణం సాధ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తంగళ్లపల్లి మండలం తాడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అన్నారు. వాహనదారులు తమ స్వీయ రక్షణార్థం, కుటుంబ క్షేమం కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు గ్రామాల్లో ఉన్న రహదారి భద్రతా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సమన్వయంతో పని చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

మహిళలు, యువతులు, బాలికలు జిల్లా షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, పని చేసే ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నిర్భయంగా షీ టీమ్ నంబర్ 87126 56425ను సంప్రదించాలని తెలిపారు. భరోసా కేంద్రం ద్వారా న్యాయ, వైద్య సహాయం, మానసిక కౌన్సెలింగ్ సేవలు అందిస్తామని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసు శాఖకు సహకరిస్తూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ ఉపేందర్ చారి, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.

Next Story