ఆప్ గెలుపుతో అర్వింద్ కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ?

by Shamantha N |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత నాలుగు నెలలుగా అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించ లేదు.

ఆప్ గెలుపుతో అర్వింద్ కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో  ఎంట్రీ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత నాలుగు నెలలుగా అరవింద్ కేజ్రీవాల్ ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించ లేదు. అయితే నాలుగు రాష్ట్రాల్లో అయిదు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఆమ్ ఆద్మీ పార్టీ రెండు స్థానాల్లో గెలిచింది. దీంతో అర్వింద్ కేజ్రీవాల్ మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే చర్చ ప్రారంభమైంది. గుజరాత్‌లోని విసావదార్, పంజాబ్‌లోని లుధియానా వెస్ట్ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందగా.. ముఖ్యంగా ప్రధాని మోదీ స్వస్థలమైన గుజరాత్‌లో గెలవడం (AAP)కు గర్వకారణంగా మారింది. ఈ గెలుపుతో పార్టీ నేతలు ఇది కేజ్రీవాల్ తిరిగి ఎంట్రీ అని పేర్కొంటున్నారు. పార్టీపై అవినీతి ఆరోపణలు, కొందరు కీలక నేతలు జైలులో ఉన్న సమయంలో ఈ గెలుపు రావడం ద్వారా కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీకి కొత్త శక్తిని అందించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజ్యసభకు కేజ్రీవాల్?

పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంపీగా ఉన్న సంజీవ్ అరోరా ఇటీవల బైఎలక్షన్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం, ఆయన ఖాళీ చేయనున్న రాజ్యసభ స్థానంలో కేజ్రీవాల్ వెళతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఈ విజయాలను కేజ్రీవాల్ విధానాలకు, భగవంత్ మాన్ పాలనకు, కార్యకర్తల నిబద్ధతకు ఫలితంగా అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా ఇది ఆయనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లే. జాతీయ స్థాయిలో తిరిగి ప్రబలంగా కనిపించాలనే ఆయన ఆకాంక్షకు ఈ విజయాలు ఊతమివ్వనున్నాయి. రాజకీయంగా మళ్లీ కేజ్రీవాల్ వెలుగులోకి రానున్నారా అన్న ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది.

Next Story