వోక్స్‌వ్యాగన్‌లో చారిత్రాత్మక సంక్షోభం: లక్ష మంది ఉద్యోగాల కోత!

by Naga Rani Yarlagadda |

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. ప్రపంచంలో లక్షలాదిమంది ఐటీ ఉద్యోగాలు ఊడిపోతున్న వేళ.. ఓ కార్ల కంపెనీ కూడా తన ఉద్యోగులకు ఊహించని షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వోక్స్‌వ్యాగన్‌లో చారిత్రాత్మక సంక్షోభం: లక్ష మంది ఉద్యోగాల కోత!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. ప్రపంచంలో లక్షలాదిమంది ఐటీ ఉద్యోగాలు ఊడిపోతున్న వేళ.. ఓ కార్ల కంపెనీ కూడా తన ఉద్యోగులకు ఊహించని షాకిచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇందుకు కారణం ఏఐ కాదు. ప్రముఖ జర్మన్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్ వ్యాగన్ గ్రూప్.. చరిత్రలోనే అత్యంత భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆలివర్ బ్లూమ్ దాదాపు లక్షమంది ఉద్యోగులను తొలగించడంతో పాటు.. జర్మనీలోని నాలుగు ప్రధాన తయారీ ప్లాంట్లను మూసివేయాలని ఆలోచిస్తున్నారన్నది ఆ కథనాల సారాంశం. అంతేకాదు కంపెనీలో పెట్టుబడుల్లో కూడా భారీగా కోత విధించే ఛాన్సున్నట్లు కూడా అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

బోర్డు ఆమోదం కోసం వేచి చూస్తున్న ప్రతిపాదిత ప్లాన్ ప్రకారం.. వోక్స్ వ్యాగన్ రాబోయే ఐదేళ్లలో తన పెట్టుబడి ప్రణాళికలను 15 శాతం వరకూ తగ్గించుకోనుంది. ఫలితంగా కంపెనీ క్యాపిటల్ ఖర్చులు కేవలం 130 బిలియన్ యూరోలకే పరిమితం కానున్నట్లు మేనేజర్ మ్యాగజైన్ పేర్కొంది. వ్యాపార కార్యకలాపాలను క్రమబద్దీకరించే వ్యూహంలో భాగంగా కోర్ 'VW ప్యాసింజర్ కార్' బ్రాండ్ ను, విడిభాగాల వ్యాపారాన్ని విడివిడి సంస్థలుగా విభజించే అంశాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది.

చైనా ఈవీలు, అమెరికా పన్నుల సెగే కారణమా?

వోక్స్ వ్యాగన్ ప్రస్తుతం అమెరికా విధిస్తోన్న టారిఫ్ లు, చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీతోపాటు.. ఈవీ మార్కెట్లోకి మారుతున్న క్రమంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో గ్రూప్ ప్రధాన ఆటోమొబైల్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని, లాభాలను పెంచుకోవాలని సీఈఓ ఆలివర్ బ్లూమ్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు రాయిటర్స్ పేర్కొన్నది. ప్రస్తుత వాహన ప్రోగ్రామ్‌లు ముగిసిన తర్వాత.. వోక్స్‌వ్యాగన్‌కు చెందిన హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్ ప్లాంట్లతో పాటు, ఆడి (Audi) కి చెందిన నెక్కర్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.

కార్మిక సంఘాల హెచ్చరిక

ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ కఠినమైన చర్యలు అమలైతే.. వోక్స్‌వ్యాగన్ ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో దాదాపు 15 శాతం మందిపై ప్రభావం పడనుంది. గతంలో అనుకున్న 50,000 ఉద్యోగాల కోత కంటే ఇది చాలా పెద్దది కావడం గమనార్హం. అయితే ఈ అంతర్గత ప్రణాళికలపై అధికారికంగా స్పందించడానికి వోక్స్‌వ్యాగన్ నిరాకరించింది. మరోవైపు ప్లాంట్ల మూసివేత, భారీ ఉద్యోగాల కోత వంటి ప్రతిపాదనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కంపెనీ వర్క్స్ కౌన్సిల్, 'ఐజీ మెటల్' (IG Metall) కార్మిక సంఘం స్పష్టం చేశాయి. ఉద్యోగుల హక్కుల కోసం తాము గట్టిగా పోరాడుతామని హెచ్చరించాయి.

Next Story