చర్చల వేళ ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక.. పాకిస్తాన్‌కు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

by Ramesh Naini |

పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం దిశగా ఇరాన్‌తో ఇస్లామాబాద్ (పాకిస్తాన్) వేదికగా జరగనున్న కీలక శాంతి చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బయలుదేరారు.

చర్చల వేళ ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక.. పాకిస్తాన్‌కు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం దిశగా ఇరాన్‌తో ఇస్లామాబాద్ (పాకిస్తాన్) వేదికగా జరగనున్న కీలక శాంతి చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ నేతలు నిజాయితీగా చర్చలకు వస్తే అమెరికా కూడా సానుకూలంగా స్పందిస్తుందని, అలా కాకుండా తమతో ఆటలాడాలని చూస్తే బృందం దీటుగా బదులిస్తుందని వాన్స్ స్పష్టం చేశారు.

ట్రంప్ మార్గదర్శకాలతో..

దశాబ్దాల తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ అత్యున్నత స్థాయి చర్చల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. వాన్స్ నేతృత్వంలోని ఈ బృందంలో స్టీవ్ విట్‌కాఫ్, జేర్డ్ కుష్నర్ వంటి కీలక నేతలు ఉన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల కొనసాగింపు, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా ఏ మేరకు సానుకూల ఫలితాలు వస్తాయన్నది ఉత్కంఠగా మారింది. అమెరికా-ఇరాన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా మాట్లాడుకుంటారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, అమెరికా ఉపాధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి శాంతి చర్చలకు నేతృత్వం వహించడం అరుదైన విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story