సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు : 'ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్స్' తో విరుచుకుపడ్డ అగ్రరాజ్యం

by Ramesh Naini |

సిరియాలో ఐసిస్ (ISIS) ఉగ్రవాదులపై అమెరికా మరోసారి భారీ స్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది.

సిరియాపై అమెరికా ప్రతీకార దాడులు : ఆపరేషన్ హాక్ ఐ స్ట్రైక్స్ తో విరుచుకుపడ్డ అగ్రరాజ్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిరియాలో ఐసిస్ (ISIS) ఉగ్రవాదులపై అమెరికా మరోసారి భారీ స్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు జనవరి 10, 2026న సిరియా అంతటా ఐసిస్ స్థావరాలపై విస్తృత ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) వెల్లడించింది. ఈ దాడులకు ‘ఆపరేషన్ హాక్‌ఐ స్ట్రైక్’ అనే పేరు పెట్టినట్లు తాజాగా ప్రకటించింది. గత నెల పామైరా ప్రాంతంలో జరిగిన ఐసిస్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక అమెరికన్ పౌర అనువాదకుడు మృతి చెందిన నేపథ్యంలో ఈ ప్రతీకార చర్యలకు అమెరికా దిగినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ గార్డ్‌కు చెందిన సార్జెంట్ ఎడ్గార్ బ్రియన్ టోరెస్-టోవర్, సార్జెంట్ విలియం నాథనియల్ హోవర్డ్‌తో పాటు పౌర అనువాదకుడు అయాద్ మంసూర్ సకాత్ ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, మిత్ర బలగాలు కలిసి నిర్వహించిన ఈ దాడులు అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యాయని సెంట్కామ్ తెలిపింది. సిరియా వ్యాప్తంగా ఐసిస్‌కు చెందిన స్థావరాలను లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి బాంబుల వర్షం కురిపించినట్లు వెల్లడించింది.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అంతం చేస్తాం..

ఈ సందర్భంగా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘మా యుద్ధసేనలను ఎవరైనా హానిచేస్తే, వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని వెతికి పట్టుకుని అంతం చేస్తాం. న్యాయాన్ని తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా మేము వదిలిపెట్టం” అని హెచ్చరించింది. ఇది ఇప్పటికే కొనసాగుతున్న ప్రతీకార చర్యల్లో భాగమేనని అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 19న కూడా అమెరికా సిరియా మధ్యభాగంలో ఐసిస్ మౌలిక వసతులు, ఆయుధ గోదాములు ఉన్న 70 లక్ష్యాలపై భారీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అమెరికా తన సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story