- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీని కలవాలనుంది.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని తాను నేరుగా కలవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక అంతర్జాతీయ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇరాన్‌తో దౌత్యపరమైన సంప్రదింపులు సానుకూలంగానే సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘ఆయన (మొజ్తబా) గాయపడి ప్రస్తుతం ప్రజల్లోకి రాకపోయినప్పటికీ, కొరియర్ల ద్వారా ఇరాన్ కీలక నిర్ణయాలలో భాగస్వామి అవుతున్నారు. ఆ దేశంలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ప్రస్తుతం మా మధ్య చర్చలు బాగానే సాగుతున్నాయి, పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే మేము కలుసుకుంటాం’ అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రత్యక్ష చర్చల వైపే మొగ్గు
ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్నది అమెరికా ప్రధాన నిబంధన అని, ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. శత్రు దేశాల అధినేతలతో నేరుగా చర్చలు జరిపే తన పాత వ్యూహాన్నే ట్రంప్ ఇక్కడ కూడా ప్రస్తావించారు. గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరిపిన చర్చల తరహాలోనే, ఇరాన్ సంక్షోభాన్ని ముగించేందుకు ఖమేనీతో ముఖాముఖి భేటీకి సిద్ధమని ప్రకటించారు.
అజ్ఞాతంలో ఖమేనీ..
గతంలో మొజ్తబా ఖమేనీని ‘లైట్‌వెయిట్’ అని విమర్శించిన ట్రంప్, ఇప్పుడు ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం సానుకూల ధోరణి కనబరచడం గమనార్హం. అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ బహిరంగంగా కనిపించలేదు. మునుపటి వైమానిక దాడుల్లో ఆయన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా, మొజ్తబా తీవ్రంగా గాయపడి అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.






