సముద్రంలో కుప్పకూలిన యూఎస్ నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్

by Malleboina Mahesh |

ఆకాశంలో తీసుకెళ్లాల్సిన ఫైటర్ జెట్, హెలికాప్టర్ ఉన్నట్టుండి సముద్రంలో కుప్పకూలాయి. ఈ షాకింగ్ ఘటన దక్షిణ చైనా సముద్రంలో చోటు చేసుకుంది.

సముద్రంలో కుప్పకూలిన యూఎస్ నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్
X

దిశ, వెబ్ డెస్క్: ఆకాశంలో తీసుకెళ్లాల్సిన ఫైటర్ జెట్, హెలికాప్టర్ ఉన్నట్టుండి సముద్రంలో కుప్పకూలాయి. ఈ షాకింగ్ ఘటన దక్షిణ చైనా సముద్రంలో చోటు చేసుకుంది. అమెరికా నౌకాదళానికి చెందిన హెలికాప్టర్, ఫైటర్ జెట్ వరుసగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. యూఎస్ పసిఫిక్‌ ఫ్లీట్‌కు చెందిన యూఎస్‌ఎస్ నిమిట్జ్ (USS Nimitz) అనే విమాన వాహక నౌకపై నుంచి ఎగిరిన ఎంహెచ్–60ఆర్ సీహాక్‌ హెలికాప్టర్‌ రొటీన్‌ ఆపరేషన్ల సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే అదే నౌక నుంచి బయలుదేరిన బోయింగ్‌ ఎఫ్/ఏ–18ఎఫ్‌ సూపర్‌ హార్నెట్‌ ఫైటర్‌ జెట్‌ కూడా సముద్రంలో కూలిపోయింది.

అయితే ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అమెరికా నేవీ అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు సిబ్బందిని, జెట్‌లో ఉన్న ఇద్దరిని సురక్షితంగా రక్షించారని వారు తెలిపారు. యూఎస్ నేవీ ప్రకారం.. ఫైటర్ జెట్, హెలికాప్టర్ సాధారణ మిషన్‌లో ఉన్నప్పుడు సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం. ప్రమాదాలపై విచారణ ప్రారంభించినట్లు పసిఫిక్‌ ఫ్లీట్‌ కమాండ్‌ పేర్కొంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఉత్కంఠ పరిస్థితుల నడుమ ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలు నిలిచినా, రెండు ఆధునిక యుద్ధ వాహనాల నష్టం అమెరికా నేవీ కి పెద్ద దెబ్బ గా భావిస్తున్నారు.

Next Story