- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా.. అభ్యంతరం లేదన్న పాక్
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న 'ది రెసిస్టన్స్ ఫ్రంట్ (TRF)'ను అమెరికా ప్రభుత్వం విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న 'ది రెసిస్టన్స్ ఫ్రంట్ (TRF)'ను అమెరికా ప్రభుత్వం విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా పాకిస్థాన్ (Pakistan) స్పందించింది. అమెరికా తీసుకున్న నిర్ణయానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ తాజాగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియోతో వాషింగ్టన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదంపై పోరాటం తదితర అంశాలపై చర్చించారు.
ఈ సమావేశ అనంతరం ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడుతూ, 'TRFను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించడం వారి సార్వభౌమాధికారం. ఏ దేశానికైనా తగిన ఆధారాల ఆధారంగా అలాంటి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. మాకు దానిపై ఎలాంటి అభ్యంతరం లేదు. ఆధారాలుంటే ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. మేము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కట్టుదిట్టమైన నిబంధనలను అనుసరిస్తున్నాం'అని అన్నారు. అయితే, టీఆర్‌ఎఫ్‌ను లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ సంస్థను తాము కొన్ని సంవత్సరాల క్రితమే కూల్చేశామని, వారిని విచారించి, అరెస్టు చేసి జైల్లో పెట్టామన్నారు.
కాగా, టీఆర్ఎఫ్ అనేది హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా వంటి పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై దాడికి పాల్పడిన ఘటన తర్వాత అమెరికా దీనిని ఉగ్రసంస్థగా గుర్తిస్తూ అధికారికంగా ప్రకటించింది.






