ఉక్రేనియన్ శరణార్థి పిల్ల‌ల‌కి ఇటాలియ‌న్ స్కూల్లో వెల్‌క‌మ్‌! క‌ళ్లు చ‌మ‌ర్చే వీడియో!!

by Disha Web Desk 20 |
ఉక్రేనియన్ శరణార్థి పిల్ల‌ల‌కి ఇటాలియ‌న్ స్కూల్లో వెల్‌క‌మ్‌! క‌ళ్లు చ‌మ‌ర్చే వీడియో!!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'వాళ్ల చుట్టూ ఏంజరుగుతుందో అర్థంకాదు.. అమ్మానాన్న ఎందుకు త‌మ‌కు ఇష్ట‌మైన ఇంటిని వ‌దిలేసి వేరే దేశానికి వెళ్లాల్సి వ‌స్తుందో తెలియ‌దు.. త‌డి ఆర‌ని త‌ల్లి క‌ళ్ల‌లో ఆవేద‌నకు అర్థం ఏంటో తెలుసుకోడానికి వాళ్ల‌ది చాలా చిన్న వ‌య‌సు. కానీ, కాలం వారికి ఓ కొత్త ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేసింది. ముక్కూ మొహం తెలియ‌ని అప‌రిచితులు త‌మ‌ని ప్రేమ‌గా కౌగిలించుకుంటున్నారు, ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. ఆవేద‌న‌తో నిండిన క‌ళ్ల‌లో ఆనందాన్ని నింప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు'. దేశం విడిచి మ‌రో దేశంలో ఆశ్ర‌యం పొందుతున్న చాలా మంది చిన్నారుల మ‌న‌సుల్లో మెదులుతున్న ఆలోచ‌న‌లు ఇవే..!

గ‌త మూడు వారాల్లో ఉక్రెయిన్ విడిచి వెళ్లిన శరణార్థుల్లో పిల్లలే దాదాపు సగం మంది ఉన్నారు. అందులో చాలామంది పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా, మోల్డోవా, ఇతర యూరోపియన్ దేశాలకు పారిపోయారు. ఇలా అన్ని దేశాల్లోనూ శ‌ర‌ణార్థుల‌ను క‌డుపులో పెట్టుకొని చూసుకోడానికి ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నారు. మాన‌వ‌త్వంతో ఆదుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇటలీకి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు ఉక్రేనియన్ శరణార్థి పిల్లలు కొత్తగా పాఠశాలకు వెళ్లిన‌ మొదటి రోజు వీడియో అది. ఈ వీడియో ఇటలీలోని నేపుల్స్‌లోని డాన్ మిలానీ ఇన్స్టిట్యూట్‌లో తీసింది. ఇందులో, ఇద్దరు అక్కాచెళ్లెళ్లు, డిమిత్రి (10), విక్టోరియా (8) స్కూల్లో అడుగుపెడుతుంటే పాఠ‌శాలలో అంద‌రూ నిల‌బ‌డి వారికి స్వాగ‌తం ప‌లుకుతారు. అందులో ఉక్రేనియన్ జెండాలను పట్టుకుని చాలా మంది క‌నిపిస్తారు. యుద్ధానికి అర్థం తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, ప్రేమ‌కు భాష అవ‌స‌రం ఏముంటుంది?! అందుకే, అంత‌టి ఆదరణను చూసి పిల్ల‌లు ఆశ్చ‌ర్య‌పోతారు, క‌ళ్లు నిండుగా ఆనంద భాష్పాలు కురిపిస్తారు.


Next Story

Most Viewed