Ukraine | కాళీ మాత ఫొటో ట్వీట్‌పై భారత్‌కు ఉక్రెయిన్ క్షమాపణ

by Disha Web Desk 16 |
Ukraine | కాళీ మాత ఫొటో ట్వీట్‌పై భారత్‌కు ఉక్రెయిన్ క్షమాపణ
X

ఉక్రెయిన్ (Ukraine) రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల కాళీమాత (Goddess Kali) ఫోటోను అసభ్యకర రీతిలో ట్వీట్ చేసినందుకు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ డ్జపరోవా మంగళవారం క్షమాపణలు చెప్పారు. తమ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కాళీమాతను వికృతంగా చిత్రీకరించినందుకు ఉక్రెయిన్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ‘‘ మేము ప్రత్యేకమైన భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నాం. భారతదేశం నుంచి వస్తున్న మద్దతును చాలా ప్రశంసిస్తున్నాం’’ఎమిన్ డ్జపరోవా ట్వీట్ లో పేర్కొన్నారు.

ఉక్రెయిన్ రక్షణ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఇటీవల ఓ అభ్యంతరకర చిత్రాన్ని పోస్టు చేసింది. ఆ చిత్రంలో లుడు కారణంగా ఎగసిన దూళిపై హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను పోలిన బొమ్మ గీసి ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో ఓ చిత్రాన్ని షేర్ చేసింది. పైకి లేస్తున్న స్కర్ట్‌లో ఉన్న స్త్రీ చిత్రం అయినప్పటికీ.. ఆ చిత్రానికి పొందుపర్చిన వేషధారణ హిందువుల దేవత మహంకాళీ అవతారంలో ఉంది. ఈ ట్వీట్‌ను చూసిన భారతీయులు సోషల్ మీడియా వేదికగా యుక్రెయిన్‌పై విమర్శలకు దిగారు. ఈ చిత్రం హిందూ దేవత కాళీని పోలి ఉందని, ఇలాంటి చిత్రాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా యుక్రెయిన్ ప్రవర్తించిందంటూ కొందరు భారతీయులు ట్వీట్లు చేశారు.

రష్యాతో యుద్ధంలో భారత్ సాయం కోరిన ఉక్రెయిన్ ప్రభుత్వం.. తమ దేశంలో విస్తృతంగా ఆరాధించే దేవతను అవమానిస్తోందని పలువురు నెటిజన్లు నిన్న విమర్శించారు. నీలి రంగు చర్మం, నాలుకను బయటపెట్టిన భంగిమ, మెడ చుట్టూ పుర్రెల దండతో అచ్చుగుద్దినట్లు కాళీమాతను పోలినట్లుగా వున్న ఆ వ్యంగ్య చిత్రం హిందూ సంస్కృతిని అపహాస్యం చేసేలా వుందంటూ భారతీయులు ఉక్రెయిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే ఈ ట్వీట్ పై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు. ఈ ఫొటోపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన పలువురు నెటిజన్లలో గుప్తా కూడా ఉన్నారు.

ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ డ్జపరోవా భారత్ లో పర్యటించిన కొద్ది రోజులకే ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్లో పర్యటించిన తొలి ఉక్రెయిన్ ఉన్నతాధికారి ఆమె. పర్యటన సమయంలో ఆమె కేంద్రమంత్రి మీనాక్షి లేఖిని కలిశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రాసిన లేఖను ఎమిన్ మీనాక్షి లేఖికి అందజేశారు.


Next Story

Most Viewed