- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ ‘శాంతి’ దండయాత్రలు
ఏడు యుద్ధాలు ఆపాను.. శాంతి బహుమతి ఇవ్వరా? అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న మాటల వెనుక పచ్చి నిజాలు. అసలు ఆయన ఎన్ని యుద్ధాలు ఆపారో తెలుసా? నోబెల్ శాంతి బహుమతి రూల్స్ తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: ‘ఒంటిచేత్తో ఏడు యుద్ధాలు ఆపాను. ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ ఎవరూ ఇలా చేయలేదు.’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ట్వీట్లు చేయడమే కాకుండా ఆయన పీఆర్ టీమ్ అంతా ఇదే విషయాన్ని ప్రచారం చేశాయి. ఇన్ని యుద్ధాలు ఆపినా ట్రంప్ కు ఎందుకు శాంతి బహుమతి రాలేదు.. అని కూడా కొందరు అమెరికన్లలో ఈ భావన ఉన్నది. కానీ, వాస్తవం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. అసలు ట్రంప్ ఆపానని చెప్తున్న యుద్ధాల్లో ఒకటి అసలు జరుగనే లేదు. అయినా తన ఖాతాలో ఆ విజయాన్ని వేసుకున్నాడు. ఆయన చెప్తున్న యుద్ధాల్లో ఆగింది ఒక్కటి మాత్రమే. మరి మిగితా ఐదు యుద్ధాల సంగతి ఏంటి? వాటి వివరాలతో ప్రత్యేక కథనం.
‘ట్రంప్‌కి నోబెల్ శాంతి పురస్కారం కావాలని ఉన్నది.. కానీ, నోబెల్ కమిటీకి ట్రంప్ అవసరం లేదు.’ ఇదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోక్. యుద్ధాలు ఆపానని చేస్తున్న ట్రంప్ కామెంట్లు.. సోషల్ వేదికలకే పరిమితమవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రభావం చూపడంలేదు. ఏదైనా దేశాల మధ్య చిన్న తగవు వచ్చినా వెంటనే ఎక్స్, ట్రూత్ సోషల్ మీడియాల్లో గొడవ ఆపేయండి అని కామెంట్లు చేయడం తప్ప ట్రంప్ చేసిన ప్రయత్నం పెద్దగా ఏమీలేదు. పైగా తన టారిఫ్స్ ను వారిపై ప్రయోగిస్తూ.. తన పబ్బం గడుపుకునేలా వ్యవహరించారు. మరి ట్రంప్ ఆపానని చెప్తున్న యుద్ధాలు ఎన్ని? అందులో అసలు నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. ఇజ్రాయెల్ - ఇరాన్ ఘర్షణ
ట్రంప్ కామెంట్:: ‘ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఆపాను’. (జూన్ 2025లో మీడియా సమావేశం)
వాస్తవం:: నిజానికి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగలేదు. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేసింది. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారలేదు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ ఒత్తిడితోనే సమస్య ముదరకుండా తాత్కాలిక సీజ్ ఫైర్ పాటించాయి. అయితే, ఇజ్రాయెల్ మాత్రం తాను అనుకున్న లక్ష్యాలను నాశనం చేశానని ప్రకటించగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులకు బదులు తీర్చుకున్నట్లు ప్రకటించింది. అందువల్ల ఇది శాంతి ఒప్పందం అనేకంటే దాడులకు తాత్కాలిక విరామం అని మాత్రమే పరిగణించాలి.
2. భారత్ - పాకిస్థాన్
ట్రంప్ కామెంట్:: ‘భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపాను. ఇద్దరూ నా మాట విన్నారు.’ (మే 10, 2025న ఫ్లోరిడాలో ర్యాలీలో)
వాస్తవం:: భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా ఒప్పించాను. ఈ రెండు దేశాలు సరిహద్దు కాల్పుల విరమణకు అంగీకరించాయి.. అని ట్రంప్ ఫ్లోరిడాలో జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించాడు. కానీ, భారత్ ట్రంప్ వాదనను తిప్పికొట్టింది. సరిహద్దు వ్యవహారాల్లో మూడో దేశం జోక్యం అవసరంలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై ట్రంప్ కూడా రెండు, మూడు సార్లు పరస్పర విరుద్ధ వాదనలు చేశారు. అయినా, తీరు మార్చుకోలేదు. దీంతో ఈ యుద్ధ ప్రస్తావన కూడా రాజకీయ వ్యాఖ్యగానే మిగిలిపోయింది.
3. థాయ్‌లాండ్ - కాంబోడియా
ట్రంప్ కామెంట్:: నా జోక్యం వల్లనే థాయ్ లాండ్, కాంబోడియా మధ్య యుద్ధంఆగింది (జూలై 2025, ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్)
వాస్తవం:: అసలు ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడూ యుద్ధమే జరుగలేదు. ఆ సమయంలో కేవలం చిన్న సరిహద్దు వివాదం మాత్రమే చోటుచేసుకుంది. స్వల్ప మొత్తంలో చిన్న శ్రేణి రాకెట్లు, కాల్పుల మాత్రమే జరిగాయి. అందుకే ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వాదనను తప్పుడు సమాచారంగా గుర్తించాయి.
4. ఆర్మేనియా-అజర్‌బైజాన్ (ఆగస్ట్ 2025)
ట్రంప్ కామెంట్:: ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య రక్తపాతం ఆపాను. (ఆగస్టు 2025)
వాస్తవం:: ఈ యుద్ధం 2024 చివర్లో మొదలై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కొనసాగింది. ట్రంప్ చర్చలకు మద్దతు తెలిపినా వాస్తవంగా రష్యా, టర్కీలో మధ్యవర్తిత్వం చేశాయి. అయినప్పటికీ ఈ రెండు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం మాత్రమే కుదిరింది. శాంతి ఒప్పందం జరగలేదు.
5. రువాండా - డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో
ట్రంప్ కామెంట్:: రువాండా, కాంగో మధ్య యుద్ధం ఆపాను. వాళ్లు నా మాట విని సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నారు. (జూలై 2025లో ప్రకటన)
వాస్తవం:: ఇందులో ట్రంప్ పాత్ర కన్నా.. ఐక్యరాజ్యసమితి పాత్రే ఎక్కువ. అమెరికా పాత్ర పూర్తిగా పరోక్షంగా ఉన్నది. ట్రంప్ చెప్పినంత స్థాయిలో ఆయన ఈ విషయంలో చొరవ తీసుకోలేదు. రెండు దేశాల మధ్య యుద్ధం ఆగినా.. సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి.
6. యెమెన్ - హౌతీ
ట్రంప్ కామెంట్:: యెమెన్‌లో హౌతీ తిరుగుబాటును నేను ఆపాను. (మే 22, 2025న సీఎన్ఎన్ ఇంటర్వ్యూ)
వాస్తవం:: ఇందులో కొంత మాత్రమే నిజం ఉన్నది. ఈ రెండు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్ జరిగింది. అయితే, అది తాత్కాలికమే. జూన్ లో మళ్లీ దాడులు కొనసాగాయి. ఈసారి మాత్రం ట్రంప్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ముగిసినా.. అది తాత్కాలిక విరామంగానే చెప్పవచ్చు.
7. ఇజ్రాయెల్ - యూఏఈ
ట్రంప్ కామెంట్:: ఇజ్రాయెల్ - యూఏఈ మధ్య ఉద్రిక్తతలు తగ్గించాను. (ఈ ఒక్క ఘటనే వాస్తవానికి దగ్గరగాఉంది)
2020లో యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య ‘అబ్రహం ఒప్పందం’పై సంతకం జరిగింది. ఇది ప్రాంతీయ సంబంధాల్లో పెద్ద మార్పుకు కారణమైంది. కానీ ఇదే ఒక్క ఉదాహరణతో ‘ఏడు యుద్ధాలు ముగించాను’ అని ట్రంప్ చెప్పడం మాత్రం అతిశయోక్తిగా నిలిచింది.
శాంతి బహుమతి.. అసలు కహానీ
నిజానికి నోబెల్ శాంతి బహుమతికి దక్కించుకునేందుకు స్పష్టమైన ప్రొసీజర్ ఉంది. ఎవరైనా దేశాధినేతలు, ప్రజాప్రతినిధులు, శాంతికోసం పనిచేసే ప్రభుత్వ విభాగాల నేతలు, స్వచ్ఛంద సంస్థల పేర్లను మాత్రమే శాంతి బహుమతికోసం పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, వారు నేరుగా నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేదు. వారి తరఫున ఎవరైనా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఇందుకు నోబెల్ పీస్ కమిటీ వెబ్‌సైట్‌నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని స్వయంగా నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ దరఖాస్తుకు ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ వేసే అవకాశం ఉన్నా.. ఆ ఏడాదికి మాత్రం పరిశీలించరు. తర్వాతి ఏడాదికి పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో బహుమతికి నామినేట్ చేస్తున్న వ్యక్తి వివరాలతోపాటు అతడికి ఎందుకు బహుమతి ఇవ్వాలో కూడా వివరించాలి. కేవలం ఈ నామినేషన్లో పేర్కొన్న వివరాల ఆధారంగానే కమిటీ స్వతంత్ర దర్యాప్తు చేస్తుంది. అలాగే స్వతంత్ర కమిటీ దర్యాప్తులో సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోదు. వాటి ఆధారంగా ప్రభావితం కాదు. అందువల్ల నామినేషన్ సమయానికి ముందు జరిగిన పరిణామాలపైనే కమిటీ ఫోకస్ చేస్తుంది. కానీ, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైంది.. ప్రమాణం చేసింది ఈ ఏడాది జనవరి 20వ తేదీన. కేవలం 13రోజుల్లోనే ఆయన చేసిన శాంతి ప్రయత్నాలకు నోబెల్ దక్కుతుందా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మొత్తానికి ట్రంప్ నామినేషన్‌ను అసలు కమిటీ పరిగణనలోకి కూడా తీసుకోలేదన్నది ఈ విషయంతో స్పష్టమైంది. అయితే, ఈ నామినేషన్ లో ఏ పేర్కొన్నారు. ఎవరు నామినేట్ చేశారు? అన్న విషయాలను మాత్రం నోబెల్ కమిటీ గోప్యంగా ఉంచుతుంది. నిబంధనల ప్రకారం 50ఏండ్ల తర్వాత మాత్రమే ఈ విషయాలు వెలుగుచూస్తాయి. సో అదీ అసలు కథ. మరి ట్రంప్ ఎందుకింత పెంకితనంతో కామెంట్లు చేశారు? ఎందుకిలా ప్రచారం చేశారు? అన్న వాదనలకు కొందరు తమదైన శైలిలో సమాధానమిస్తూ.. వచ్చే ఏడాదికోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.






