వియత్నాంలో ఘోర విషాదం.. భారతీయ పర్యాటకుల బోటు బోల్తా, 15 మంది మృతి?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-11 10:30:22  IST  )

వియత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫూ కుయోక్ ఐలాండ్ సమీపంలో శనివారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

వియత్నాంలో ఘోర విషాదం.. భారతీయ పర్యాటకుల బోటు బోల్తా, 15 మంది మృతి?
X

దిశ, వెబ్‌డెస్క్: వియత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫూ కుయోక్ ఐలాండ్ సమీపంలో శనివారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో వెళ్తున్న పర్యాటక బోటు సముద్రంలో ప్రమాద వశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించినట్లు తెలుస్తోంది. వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన టూరిస్టులు ఉన్నట్లు సమాచారం. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కాకినాడకు చెందిన మరో యువకుడు మృతి చెందగా.. ఏపీకి చెందిన మరో నలుగురు గల్లంతైనట్లు సమాచారం. స్థానిక రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. పలువురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. హనోయ్ లో కూడా మరో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొంది. బాధిత కుటుంబ సభ్యులు హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్: +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414, హనోయ్ కంట్రోల్ రూమ్: +84 91 308 9165 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన టూరిస్టులపై ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ.. తమ డిస్ట్రిబ్యూటర్లకు ఏర్పాటు చేసిన విహారయాత్రలో భాగంగానే వారంతా వియత్నాం వెళ్లినట్లు సమాచారం. మొత్తం 250 మంది భారతీయులను టూర్ కు తీసుకెళ్లగా.. వారిలో ఏపీకి చెందినవారు 35 మంది, తెలంగాణకు చెందినవారు 45 మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ సముద్ర ప్రాంతంలో అలలు తీవ్రంగా ఉన్నాయని, వర్షం లేకపోయినప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉండగా.. పర్యాటక బోట్లు యథావిధిగా తిరిగాయని పేర్కొంది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలు, ప్రయాణికుల పరిస్థితి, ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ఉన్నారన్నదానిపై స్థానిక పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story