టైటానిక్ విషాదానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన లైఫ్ జాకెట్.. వేలంలో రికార్డు

by Naga Rani Yarlagadda |

టైటానిక్ మునిగిపోయిన సమయంలో ఓ ప్రయాణికురాలిని కాపాడిన లైఫ్ జాకెట్.. వేలంలో రికార్డు సృష్టించింది.

టైటానిక్ విషాదానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన లైఫ్ జాకెట్.. వేలంలో రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: టైటానిక్ నౌకకు సంబంధించిన వస్తువుల విలువ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ చారిత్రక నౌక మునిగిపోయిన సమయంలో ఓ ప్రయాణికురాలి ప్రాణాన్ని కాపాడిన లైఫ్ జాకెట్ తాజాగా నిర్వహించిన వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. అన్ని రకాల ఛార్జీలతో కలిపి ఒక అజ్ఞాత వ్యక్తి దీనిని ఏకంగా రూ.9 కోట్లకు దక్కించుకున్నారు. హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ అనే సంస్థ ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ఈ వేలంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ వస్తువుకు 6,70,000 పౌండ్ల ధర పలికింది. పన్నులు, ఇతర రుసుములు చేర్చగా దీని విలువ రూ.9 కోట్లకు చేరడం గమనార్హం. ఫోన్ కాల్ ద్వారా వేలంలో పాల్గొన్న ఒక వ్యక్తి ఈ అరుదైన వస్తువును సొంతం చేసుకున్నారు.

ఆ లైఫ్ జాకెట్ స్పెషాలిటీ ఇదే

ఈ లైఫ్ జాకెట్ లారా మాబెల్ ఫ్రాంకటెల్లి అనే ఫస్ట్ క్లాస్ ప్రయాణికురాలిది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ లూసీ డఫ్ గోర్డాన్ దగ్గర ఆమె కార్యదర్శిగా విధులు నిర్వర్తించేవారు. 1912 నాటి ఆ భయంకర ప్రమాదం నుండి తన యజమానులతో కలిసి ‘లైఫ్ బోట్ నంబర్ 1’ ద్వారా ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. గట్టి కాన్వాస్ క్లాత్, కార్క్ ముక్కలతో రూపొందించిన ఈ జాకెట్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వస్తువుకు ఇంతటి డిమాండ్ రావడానికి మరో ప్రధాన కారణం ఉంది. దీని మీద లారాతో పాటు ఆ విపత్తు నుండి ప్రాణాలు దక్కించుకున్న మరో ఎనిమిది మంది వ్యక్తుల సంతకాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం ఒక లైఫ్ జాకెట్ మాత్రమే కాకుండా ఆనాటి విషాదకర ఘటనకు సజీవ నిదర్శనంగా నిలుస్తోంది. వేలం నిర్వాహకులు దీనికి 3.5 లక్షల పౌండ్ల వరకు ధర వస్తుందని భావించగా, అంచనాలను తలకిందులు చేస్తూ రెట్టింపు రేటుకు ఇది విక్రయమైంది. ఇదే వేదికపై టైటానిక్ లైఫ్ బోట్ సీటుకు సంబంధించిన కుషన్ కూడా రూ.4.5 కోట్లకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Next Story