International Yoga Day:ఈ ఏడాది ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ లక్ష్యం ఇదే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-21 04:13:54  IST  )

ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

International Yoga Day:ఈ ఏడాది ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ లక్ష్యం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు. మనస్సు, శరీరం, ఆత్మ మధ్య సమన్వయాన్ని సాధించే ఒక జీవనం. ఈ తరుణంలో 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ‘‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’’. ఈ థీమ్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 మార్చి 30వ తేదీన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రకటించారు. ఈ థీమ్ కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా భూమి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించాల్సిన అవసరాన్ని చెబుతుంది. యోగా ద్వారా మానసిక శారీరక శ్రేయస్సు తో పాటు పర్యావరణ సామరస్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యం. స్థిరమైన జీవనం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలతో యోగాను అనుసంధానించడం ఈ థీమ్ యొక్క ముఖ్య లక్ష్యంగా చెబుతున్నారు.

అయితే.. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ లో నిర్వహించారు. ఇది రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. ఇక, గత ఏడాది 2024పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గత ఏడాది(2024) అంతర్జాతీయ యోగా డే థీమ్ ‘‘యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ” స్వీయ మరియు సమాజం యొక్క శ్రేయస్సును మెరుగుపరచడంలో యోగా యొక్క కీలక పాత్రను వివరిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది 2025 ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

యోగా ప్రాధాన్యత

క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. యోగాలో కండరాలను సురక్షితంగా మరియు క్రమంగా సాగదీయడం జరుగుతుంది. ఇది దృఢత్వాన్ని తగ్గించడానికి, చలన పరిధిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ క్రమంలో కొన్ని రకాల యోగాసనాల వల్ల కండరాల బలం పెరుగుతుంది. యోగా శరీరాన్ని స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంచడానికి శిక్షణ ఇస్తుంది. యోగా చేయడం వల్ల వయసు పెరిగే కొద్ది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని అధ్యయనాలు యోగా క్రమం తప్పకుండా సాధన చేస్తే రక్తపోటును తగ్గించడంలో మరియు మెరుగైన ప్రసరణకు తోడ్పడుతుందని సూచిస్తున్నాయి. అలాగే, మెదడులోని సెరోటోనిన్ అనే రసాయనం పెరుగుతుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇది విచారం లేదా భావోద్వేగ అలసట భావాలు తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మానసిక అయోమయాన్ని లేదా అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. నిరంతర యోగా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Next Story