అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం ప్రారంభం.. టారిఫ్‌ల వెనుక కారణం ఇదే : ట్రంప్

by Naga Rani Yarlagadda |

అమెరికా డెడ్ కంట్రీ నుంచి మళ్లీ స్వర్ణయుగం వైపుగా అడుగులు వేస్తోందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం ప్రారంభం.. టారిఫ్‌ల వెనుక కారణం ఇదే : ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో మొదటి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి వార్షిక 'స్టేట్ ఆఫ్ యూనియన్' ప్రసంగం చేస్తూ.. ప్రస్తుతం అమెరికా స్వర్ణయుగంలో ఉందని ఆయన ప్రకటించారు.

డెడ్ కంట్రీ నుంచి అగ్రగామిగా..

తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయానికి అమెరికా ఒక డెడ్ కంట్రీగా ఉందని, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ఆకర్షణీయమైన దేశంగా ఎదిగిందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. "నా తోటి అమెరికన్లారా.. మన దేశం తిరిగి పుంజుకుంది. మునుపటి కంటే మరింత పెద్దదిగా, మెరుగ్గా, ధనికమైనదిగా, బలంగా తయారైంది" అని ఆయన పేర్కొన్నారు.

ఆర్థిక రికార్డులపై ట్రంప్ గర్జన

దేశంలోని ద్రవ్యోల్బణం, గ్యాస్ ధరలు, ఉపాధి అవకాశాల వంటి కీలక అంశాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నాలుగేళ్లలో కేవలం 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే తీసుకురాగలిగితే, తన యంత్రాంగం కేవలం 12 నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఒప్పందాలను సాధించిందని ఆయన వెల్లడించారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పన్నుల తగ్గింపును తమ ప్రభుత్వం అమలు చేసిందని, అయితే దీనిని డెమోక్రాట్లు వ్యతిరేకించారని ఆయన విమర్శించారు. వారు పన్నులు పెంచాలని చూసినా, తాము మాత్రం ప్రజల పక్షాన గట్టిగా నిలబడ్డామని నొక్కి చెప్పారు.

టారిఫ్ ల పై మళ్లీ క్లారిటీ

ఈ సందర్భంగా ప్రపంచ దేశాలపై విధించిన పన్నులపై మరోసారి ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. పన్నుల నిబంధనల మార్పుకు కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదని పేర్కొన్నారు. పన్నుల అమలు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామని తెలిపారు. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లు కొనసాగుతాయని, తాము విధించిన టారిఫ్ లకు చట్టబద్ధత ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల అమెరికా పౌరులపై పన్నుల భారం తగ్గుతుందన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకే టారిఫ్ లు ప్రకటించామన్నారు.

250వ ఏడాదికి కొత్త హామీ

అమెరికా ఆవిర్భవించి 250 ఏళ్లు పూర్తికాబోతున్న తరుణంలో.. సామాన్య పౌరుల ప్రయోజనాలే తమకు పరమావధి అని ట్రంప్ స్పష్టం చేశారు. "ప్రభుత్వం శక్తిమంతులకు కాదు, సామాన్య ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రతి బిడ్డ తన కలలను సాకారం చేసుకునేలా అమెరికాను నిర్మిస్తున్నాం. మన పూర్వీకుల త్యాగాలకు మనం ఇచ్చే గౌరవం ఇదే" అని ఆయన అన్నారు. 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అద్భుతంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. మునుపెన్నడూ చూడని విధంగా.. అమెరికాను మరింత బలవంతమైన దేశంగా తీర్చిదిద్దుకుందామన్నారు.

Next Story