ఆసియా ఖండం వేడెక్కుతోంది

by Shamantha N |   (  Updated:2025-06-24 05:20:59  IST  )

ప్రపంచ వాతావరణ సంస్థ ‘స్టేట్ ఆప్ ది క్లైమెట్ ఇన్ ఆసియా 2024’ నివేదికల ప్రకారం.. ఆసియాలో ఖండంలో సగటు ఉష్ణోగ్రతల కంటే 1.04 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఆసియా ఖండం వేడెక్కుతోంది
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ వాతావరణ సంస్థ ‘స్టేట్ ఆప్ ది క్లైమెట్ ఇన్ ఆసియా 2024’ నివేదికల ప్రకారం.. ఆసియాలో ఖండంలో సగటు ఉష్ణోగ్రతల కంటే 1.04 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 1991-2020 బేస్‌లైన్‌తో పోలిస్తే 2024లో సగటు ఉష్ణోగ్రతలు 1.04 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. ఇది ప్రపంచ సగటు కన్నా దాదాపు రెండు రెట్లు ఎక్కువ. హిమాలయాలు, టియాన్ షాన్ పర్వతాల్లో హిమానీనదాలు వేగంగా కరుగుతుండటంతో మంచినీటి వనరులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీరప్రాంతాల్లో వరదలు, తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇండియాలోని తీర ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపించనుంది.

ఆసియా ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేయాల్సిందే..

2024లో ఆసియా అత్యంత వేడిగల సంవత్సరాల్లో ఒకటిగా నమోదైంది. ఇండియా, జపాన్ వంటి దేశాల్లో తీవ్రమైన వేడి గాలులకు వందలాది మంది చనిపోయారు. వియత్నాంలో యాగి తుపాన్ వల్ల చాలా మంది మరణించారు. 2024 సెప్టెంబర్ లో నేపాల్‌లో వరదల కారణంగా 246 మంది మరణించారు. గల్ఫ్ దేశమైన యూఏఈలో భారీ వర్షాలు కురవడం, ఏడారి ప్రాంతంలో వరదలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచాయి ఈ నివేదిక ప్రకారం వాతావరణ మార్పును ఎదుర్కోవాలంటే ముందు జాగ్రత్త చర్యలు, విపత్తు సంసిద్ధత, వాతావరణ సేవల శక్తివంతమైన పాత్ర ఎంతో అవసరమని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆసియాలో వాతావరణం వేగంగా వేడెక్కుతుండటంతో పర్యావరణ మార్పుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ఆయా దేశాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Next Story