- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారతీయులను సేఫ్ గా తరలించేందుకు సహకరించినందుకు ఇరాన్ కు థాంక్స్
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరగ్చితో ఫోన్ లో మాట్లాడినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరగ్చితో ఫోన్ లో మాట్లాడినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే దిశగా చర్చ జరిగినట్లు పేర్కొంది. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఇరాన్ పై అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలు, భూభాగ సమగ్రతపై దాడుల్ని అరఘ్చి తీవ్రంగా ఖండించారు. నేరానికి పాల్పడిన దేశాలను జవాబుదారులుగా నిలిపే విధంగా అంతర్జాతీయ సమాజం చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జైశంకర్, ఇరాన్‌తో కొనసాగుతున్న దౌత్య సంబంధాల పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య నౌకాదళ సహకారానికి ఇరాన్ ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ లో ఉన్న భారతీయులను భద్రంగా తరలించడంలో ఇరాన్ ప్రభుత్వం చేసిన సాయానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆపరేషన్ ‘సింధు’తో భారతీయుల తరలింపు
ఈ ఫోన్ కాల్ సంభాషణకు ముందు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇప్పటివరకు 3,426 మంది భారతీయులను ఇరాన్ నుంచి, 818 మందిని ఇజ్రాయెల్ నుంచి ‘ఆపరేషన్ సింధు’లో వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. జూన్ 18న ప్రారంభించిన ఈ ఆపరేషన్‌లో, ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు ఉండగా, ఇజ్రాయెల్‌లో సుమారు 40,000 మంది భారతీయులు ఉన్నారని తెలిపారు.జూన్ 13న ప్రారంభమైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ అణు కార్యక్రమానికి ఇబ్బందులు ఏర్పడిన విషయం తెలిసిందే. భారీ బంకర్-బస్టర్ బాంబులతో జరిగిన ఈ దాడుల్లో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య క్షిపణి దాడులు పరస్పరంగా కొనసాగాయి. ఈ దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉదయం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరామాన్ని ప్రకటించారు.






