పోలాండ్‌లో వింత దృశ్యం: కాలనీలోకి దూసుకొచ్చిన అడవి పందులు.. వెంటాడి తరిమికొట్టిన ‘రోబో’

by Ramesh Naini |   (  Updated:2026-04-13 15:01:53  IST  )

జనావాసాల్లోకి వచ్చిన అడవి పందులను ఒక రోబో వెంటాడి తరిమికొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

పోలాండ్‌లో వింత దృశ్యం: కాలనీలోకి దూసుకొచ్చిన అడవి పందులు.. వెంటాడి తరిమికొట్టిన ‘రోబో’
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. నిత్య జీవితంలో ఎదురయ్యే ఊహించని సమస్యలను కూడా రోబోలు సులభంగా పరిష్కరిస్తున్నాయి. తాజాగా పోలాండ్‌లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన టెక్నాలజీకి, వన్యప్రాణి నియంత్రణకు మధ్య ఉన్న కొత్త కోణాన్ని పరిచయం చేసింది. జనావాసాల్లోకి వచ్చిన అడవి పందులను ఒక రోబో వెంటాడి తరిమికొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం.. పోలాండ్ రాజధాని వార్సా (Warsaw) లోని హిల్టన్ హోటల్ సమీపంలో ఏప్రిల్ 12 రాత్రి ఈ వింత ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో కొన్ని అడవి పందులు గుంపుగా స్థానిక కాలనీలోకి చొరబడ్డాయి. అయితే, జంతు నియంత్రణ అధికారుల (Animal Control) కంటే ముందే రంగంలోకి దిగిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్.. ఆ పందులను రోడ్లు, మైదానాల గుండా వెంటాడి తిరిగి అడవి వైపు పరుగులు పెట్టించింది. ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా ఈ సమస్యను ఆ రోబో చాలా సులభంగా పరిష్కరించి స్థానికులను ఆశ్చర్యపరిచింది.

ఆ ‘హీరో’ రోబో కథ ఇదీ..!

అడవి పందుల వెన్నులో వణుకు పుట్టించిన ఈ రోబో పేరు ‘ఎడ్వర్డ్’ (Edward). ఇది 4 అడుగుల ఎత్తు ఉండే ‘యూనిట్రీ జీ1’ (Unitree G1) మోడల్‌కు చెందిన హ్యూమనాయిడ్ రోబోట్. దీనికి ఒక బ్యాగ్‌ప్యాక్ (backpack), మోకాళ్లకు ప్యాడ్‌లు (knee pads) కూడా అమర్చి ఉండటం విశేషం. సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయెన్సర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ రోబో.. ఇప్పుడు ఏకంగా అడవి పందులను తరిమికొట్టి రియల్ లైఫ్ హీరోగా మారిపోయింది. ఇందుకు సంబంధించి @YIMBYPoland అనే ఎక్స్ యూజర్ వీడయో షేర్ చేశారు.

నెట్టింట వైరల్.. ఆసక్తికర కామెంట్స్

కాలనీలోకి వచ్చిన పందులను రోబో తరిమికొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టెక్నాలజీని ఇలా కూడా వాడొచ్చా అన్నట్లుగా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్‌లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన భారత్ నెటిజన్లు సైతం ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ‘అదే ఈ రోబోలు గనక ఇండియాకు వస్తే పరిస్థితి ఏమిటి? మన దగ్గర ఉన్న వీధి కుక్కలు, కోతుల బెడదను వదిలించడానికి ఇవి భలే పనికొస్తాయి కదా!’ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి, టెక్నాలజీ అనేది కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా, వీధుల్లో అడవి పందులను తరిమికొట్టే స్థాయికి చేరడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

జెమినీ ఏఐతో ప్రేమలో పడి వ్యక్తి ఆత్మహత్య.. డిజిటల్ వరల్డ్ లో షాకింగ్ ఘటన

Next Story