పద్మశ్రీ అవార్డు గ్రహీతపై లైంగిక ఆరోపణలు

by Shamantha N |

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళ, పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ 2013లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది

పద్మశ్రీ అవార్డు గ్రహీతపై లైంగిక ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళ, పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహారాజ్ 2013లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీకి సన్నిహితుడిగా పేరుగాంచిన కార్తీక్ మహారాజ్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. భారత్ సేవాశ్రమ్ సంఘానికి చెందిన సన్యాసి మహారాజ్, ముర్షీదాబాద్‌లోని ఒక ఆశ్రమంలో ఉన్న పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనను తీసుకెళ్లాడని మహిళ ఆరోపించింది. ఆ ఆశ్రమంలో వసతి కూడా కల్పించారని అయితే ఒక రాత్రి ఆ సన్యాసి తన గదిలోకి ప్రవేశించి బలవంతంగా దాడి చేశాడని మహిళ పేర్కొంది. జనవరి-జూన్ 2013 మధ్య ఆరు నెలల్లో కనీసం 12 సార్లు ఆ సన్యాసి తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ సంఘటన గురించి తాను భయం, నిస్సహాయత కారణంగా ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని ఆమె చెప్పింది. పోలీసులను ఆశ్రయిస్తే ఆత్మహత్య చేసుకుంటానని సన్యాసి బెదిరించాడని ఆమె తెలిపింది. మహిళ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన కార్తీక్ మహారాజ్

ఈ సంవత్సరం అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని పొందిన మహారాజ్, తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ఈ విషయంపై కోర్టులో న్యాయబృందం స్పందిస్తుందన్నారు. బీజేపీకి, సన్యాసి కార్తీక్ మహారాజ్ కు ఉన్న సంబంధంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా కార్తీక్ మహారాజ్ ఎన్నికల్లో బీజేపీకి సాయం చేస్తున్నారని, టీఎంసీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కార్తీక్ మహారాజ్ మమతా బెనర్జీ నుంచి బేషరతుగా క్షమాపణ కోరుతూ 2024లో ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. కోల్‌కతా లా కాలేజీ క్యాంపస్‌లో ఒక న్యాయ విద్యార్థిని తనపై ఒక పూర్వ విద్యార్థి ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపణలు నేపథ్యంలో ఈ ఘటన కూడా కోల్ కతాలో సంచలనంగా మారింది.

Next Story