సౌదీ అరేబియా రాజధానిని ముంచెత్తిన ఇసుక తుఫాను.. భయానక విజువల్స్ వైరల్

by Malleboina Mahesh |   (  Updated:2025-07-26 03:31:24  IST  )

సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్‌తో సహా పలు ప్రాంతాలను ఇసుక తుఫాను ముంచెత్తింది. ఈ తుఫాను ఆల్ ఖాసిమ్, జజాన్, అసిర్, అల్ బహా, మక్కా వంటి ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది.

సౌదీ అరేబియా రాజధానిని ముంచెత్తిన ఇసుక తుఫాను.. భయానక విజువల్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia) రాజధాని అయిన రియాద్‌ (Riyadh)తో సహా పలు ప్రాంతాలను ఇసుక తుఫాను (Sandstorm) ముంచెత్తింది. ఈ తుఫాను ఆల్ ఖాసిమ్, జజాన్, అసిర్, అల్ బహా, మక్కా వంటి ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఇసుక తుఫాను గంటకు 100 కి.మీ. వేగంతో దాదాపు 2,000 మీటర్ల ఎత్తు వరకు దుమ్ము ధూళిని వ్యాప్తి చేసింది. దీనివల్ల దృశ్యమానత దాదాపు శూన్యానికి చేరింది. ఈ తుఫాన్ (Sandstorm) కారణంగా రాజధాని రియాద్‌లో ఎత్తైన భవనాలు కూడా ధూళితో కప్పబడ్డాయి. జనజీవనం స్తంభించింది. శ్వాసకోశ సమస్యలతో జనం ఇబ్బంది పడ్డారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఈ ఇసుక తుఫాను వల్ల విమాన, రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈజిప్ట్ నుండి కువైట్‌కు వెళ్లే రెండు విమానాలు దమ్మామ్‌కు మళ్లించబడ్డాయి. కువైట్‌లోని షువైఖ్, షుయబా ఓడరేవుల్లో కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్‌లలో రెడ్ అలర్ట్‌లు జారీ చేశారు. బలమైన గాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, వడగళ్ల వంటి ప్రమాదాల గురించి హెచ్చరించారు. సౌదీ అరేబియా జాతీయ వాతావరణ కేంద్రం దమ్మామ్, రియాద్, తూర్పు ప్రాంతాలకు యెల్లో అలర్ట్‌లు, మక్కా, చుట్టుపక్కల ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ ఇసుక తుఫాన్ కి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో భారీ ఎత్తున ముంచుకొస్తున్న ఇసుక తుఫాన్ భీకర రూపం స్పష్టంగా కనిపించింది.

Video Link

Next Story