- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటలీలో హాలీవుడ్ సినిమా స్థాయిలో దొంగతనం! ప్లాన్ రివర్స్ కావడంతో పరార్!
ఇటలీలో హాలీవుడ్ సినిమా స్థాయిలో దోపిడీ చేసేందుకు ప్రయత్నించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటలీ వేశంలో హాలీవుడ్ సినిమా స్థాయిలో దోపిడీ చేసేందుకు ప్రయత్నించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుగ్లియా (Puglia) ప్రాంతంలో సోమవారం ఉదయం దోపిడీ ప్రయత్నం కలకలం రేపింది. కోట్లాది రూపాయల (యూరోల) డబ్బును తరలిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని 10 మంది ముసుగు ధరించిన సాయుధ ముఠా మెరుపు దాడికి దిగింది. అయితే, నగదు వాహనంలోని అత్యాధునిక 'ఫోమ్ సెక్యూరిటీ సిస్టమ్' దొంగలకు చుక్కలు చూపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిండిసి, లెచే పట్టణాల మధ్య ఉన్న SS613 హైవేపై ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 'బాటిస్టోల్లి గ్రూప్'కు చెందిన వారు డబ్బులు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడానికి దొంగలు పక్కా స్కెచ్ వేశారు.
పోలీసుల వేషధారణలో..
ముందుగా హైవేపై ముఠా సభ్యులు పోలీసుల వేషధారణలో వచ్చి, నీలిరంగు లైట్లను ఉపయోగించి వాహనాన్ని ఆపారు. తప్పించుకునే మార్గాలను మూసివేయడానికి రోడ్డుపై కారును తగులబెట్టి తప్పించుకోకుండా 'నిప్పుల గోడ'గా ఏర్పాటు చేశారు. వాహనాన్ని నిలిపిన వెంటనే హైవేపై ప్రయాణిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఏకే-47 తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు.
పేలుడు ధాటికి ఎగిరిన వాహనం.. కానీ!
ఇక, నగదు వాహనాన్ని బద్దలు కొట్టడానికి దొంగలు శక్తివంతమైన పేలుడు పదార్థాలను వాడారు. ఆ పేలుడు ధాటికి భారీ వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేచి పడింది. ఇక నగదును తీసుకెళ్లడమే అనుకున్న సమయంలో.. వాహనంలోని ఆటోమేటెడ్ ఫోమ్ సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివేట్ అయింది. సెకన్ల వ్యవధిలో డబ్బులు ఉన్న గది మొత్తం గట్టిపడే ఫోమ్‌తో నిండిపోయింది. దీంతో నగదు దొంగలకి చిక్కకుండా ఒక రక్షణ కవచంలా మారిపోయింది. ఈ తతంగం అంతా వాహనదారుల కండ్ల ముందే జరిగింది.
పోలీసుల వేట - ఇద్దరు అరెస్ట్..
దొంగతనం విఫలం కావడంతో దొంగలు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. దీంతో ప్లాన్ ప్రకారం పోలీస్ వాహనాలు వెంబడించకుండా రోడ్డుపై ఇనుప మేకులను చల్లారు. అలాగే అక్కడే ఉన్న సామాన్యుల కార్లను లాక్కుని పారిపోయే క్రమంలో పోలీసులకు, దొంగలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. చివరికి పోలీసులు ఒక ఆల్ఫా కారును స్వాధీనం చేసుకుని, దొంగల ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన ఎనిమిది మంది కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మొత్తం ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.






