ఆస్ట్రేలియా ప్రధానికి నిరసన సెగ.. మసీదు నుంచి బయటకు పంపిన ఆందోళనకారులు

by Ramesh Naini |

ఈద్‌-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినం వేళ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

ఆస్ట్రేలియా ప్రధానికి నిరసన సెగ.. మసీదు నుంచి బయటకు పంపిన ఆందోళనకారులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈద్‌-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినం వేళ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిడ్నీలోని దేశంలోనే అతిపెద్దదైన లేకెంబా మసీదును సందర్శించిన ఆయనను నిరసనకారులు చుట్టుముట్టారు. గాజా యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, ప్రధానిని ‘నరమేధ మద్దతుదారుడు’ (Genocide Supporter) అంటూ తీవ్రస్థాయిలో దూషించారు. శుక్రవారం ఈద్ ప్రార్థనల్లో పాల్గొనేందుకు ప్రధాని అల్బనీస్‌తో పాటు హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ మసీదుకు చేరుకున్నారు. వారు లోపలికి ప్రవేశించిన 15 నిమిషాలకే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సమాజం నుంచి ఒక వర్గం ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించింది. ‘ఇక్కడి నుంచి వెళ్ళిపో’, ‘సిగ్గుచేటు’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు.

ఆగ్రహానికి కారణాలు ఇవే..

పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్వాహకులు మైక్‌లో.. ‘ఈరోజు పండుగ రోజు, దయచేసి శాంతించండి’ అని విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. మొత్తానికి ప్రధానిని మసీదు నుంచి బయటకు పంపించారు. ప్రధాని బయటకు వెళ్తున్న సమయంలో కూడా వారు నినాదాలు చేస్తూ వెంబడించారు. ఇందుకు సంబందించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఆస్ట్రేలియా ముస్లిం సమాజంలో నెలకొన్న ఈ అసంతృప్తికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. గాజాలో జరుగుతున్న దాడుల విషయంలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం మద్దతు తెలపడాన్ని అక్కడి ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని వారు మండిపడుతున్నారు. ఇటీవల ఇస్లామిక్ సంస్థ ‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’పై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించడం కూడా ఈ ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం.

వెనుక ద్వారం గుండా ప్రధాని నిష్క్రమణ

నిరసనలు మిన్నంటడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఒక నిరసనకారుడిని భద్రతా అధికారి కిందకు నెట్టి అదుపులోకి తీసుకోవడం అక్కడి ఉద్రిక్తతకు అద్దం పట్టింది. చివరికి, భద్రతా కారణాల దృష్ట్యా ప్రధానిని మసీదు వెనుక ద్వారం గుండా సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు. ఈ ఘటనపై ప్రధాని అల్బనీస్ స్పందిస్తూ దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. మసీదులో దాదాపు 30,000 మంది ఉన్నారని, అందులో కేవలం కొద్దిమంది మాత్రమే అరిచారని ఆయన పేర్కొన్నారు. కొందరి నిరసనను మొత్తం ముస్లిం సమాజం ఆగ్రహంగా భావించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story