అంబానీ ఇంట పూజలో పాల్గొన్న ప్రముఖ పాప్ సింగర్ రిహానా.. సందడిగా ముంబై పర్యటన.. వైరల్

by Ramesh Naini |

ప్రముఖ గ్లోబల్ సింగర్, బ్యూటీ మొగల్ రిహానా ముంబై పర్యటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

అంబానీ ఇంట పూజలో పాల్గొన్న ప్రముఖ పాప్ సింగర్ రిహానా.. సందడిగా ముంబై పర్యటన.. వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ గ్లోబల్ పాప్ సింగర్, బ్యూటీ మొగల్ రిహానా ముంబై పర్యటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తన కాస్మెటిక్ బ్రాండ్ ‘ఫెంటీ బ్యూటీ కి హవేలీ’ పాప్-అప్ లాంచ్ కోసం రెండేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ఆమె.. అంబానీ నివాసం ‘యాంటిలియా’ను సందర్శించారు. యాంటిలియాలో ఈషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీలు రిహానాకు సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబానీ కుటుంబంతో కలిసి రిహానా పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆరతి ఇవ్వడం విశేషం. అనంతరం ‘పూలోన్ కీ హోలీ’ (పూల హోలీ) వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. భారతీయ కళలు, సంస్కృతి ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకల మధ్య రిహానా వారితో కలిసి ప్రత్యేక విందును ఆస్వాదించారు.

రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యం

రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో (టిరా, సెఫోరా ప్లాట్‌ఫామ్స్ ద్వారా అందుబాటులో) ఫెంటీ బ్యూటీ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఏప్రిల్ 23న ముంబై చేరుకున్న రిహానా.. 24న లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అంబానీ ఇంట ఆత్మీయ విందు, సాంస్కృతిక వేడుకల అనంతరం ఏప్రిల్ 25న ఆమె తన పర్యటనను ముగించుకుని తిరుగుపయనం అయ్యారు. ఈ సందర్శనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story