అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన పీఎం మోడీ. "పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనాలి.. స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ నిర్ణయం ఎంతో కీలకం" అని ట్వీట్!

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్, అమెరికా 107 రోజుల యుద్ధానికి ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందం చేసుకున్న ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన ఈ ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరతకు దారి తీయడమే కాకుండా, అనేక దేశాలలో అమాయకుల ప్రాణ నష్టానికి కారణమైందని ప్రధాని గుర్తుచేశారు.

ఈ శాంతి ఒప్పందం అమలు కావడం ద్వారా ఆయా ప్రాంతాల్లో తిరిగి శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని భారతదేశం బలంగా ఆశిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంతేకాకుండా, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన జలమార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్యానికి (Freedom of navigation and commerce) ఈ ఒప్పందం పూర్తి భరోసా ఇస్తుందని ఆకాంక్షించారు. మిగిలి ఉన్న ఇతర వివాదాస్పద అంశాలపై కూడా ఇరుదేశాల మధ్య త్వరలోనే ఫలప్రదమైన చర్చలు జరిగి.. శాశ్వత, సుస్థిర తుది ఒప్పందం దిశగా అడుగులు పడాలని ఎదురుచూస్తున్నట్లు పీఎం మోడీ తన సందేశంలో వెల్లడించారు.

Next Story