గాల్లో పేలిన విమాన ఇంజిన్‌.. 27 వేల అడుగుల ఎత్తులో బీభత్సం

by Ramesh Naini |

బోయింగ్ 737-700 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎడమవైపు ఇంజిన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన 27 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకోగా, పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో 80 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.

గాల్లో పేలిన విమాన ఇంజిన్‌.. 27 వేల అడుగుల ఎత్తులో బీభత్సం
X

దిశ, డైనమిక్ బ్యూరో: నైజీరియాలో బుధవారం ఓ వాణిజ్య విమానానికి పెను ప్రమాదం తప్పింది. అరిక్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737-700 విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎడమవైపు ఇంజిన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన 27 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకోగా, పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో 80 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. లాగోస్ నుంచి పోర్ట్ హార్కోర్ట్‌కు బయల్దేరిన ఫ్లైట్ W3 740, ముర్తలా ముహమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 7:24 గంటలకు టేకాఫ్ అయింది. ప్రయాణం మధ్యలో ఇంజిన్ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించడంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎడమవైపు ఇంజిన్ పైభాగం (కౌలింగ్) పూర్తిగా ధ్వంసమై, లోపలి యంత్ర భాగాలు బయటకు కనిపించే స్థితికి చేరాయి.

పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్లు అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానాన్ని సమీపంలోని బెనిన్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి ఉదయం 8:05 గంటలకు సురక్షితంగా దింపారు. రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో అత్యవసర సేవా బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంజిన్ ధ్వంసమై ల్యాండ్ అవుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంజిన్ నుంచి విడిపోయిన కొన్ని భాగాలు విమానం వెనుక భాగానికి (వర్టికల్ స్టెబిలైజర్) స్వల్ప నష్టం కలిగించాయి. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని జాతీయ మీడియా తెలిపింది.

ఫ్యాన్ బ్లేడ్ విరగడం వల్లే ప్రమాదం!

ఈ ఘటనపై నైజీరియన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (NSIB) విచారణ ప్రారంభించింది. ఇంజిన్‌లోని ‘ఫ్యాన్ బ్లేడ్’ విరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లోహపు అరుగుదల (మెటల్ ఫటిగ్) లేదా ఎలాంటి బయటి వస్తువు ఇంజిన్‌లోకి ప్రవేశించడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అరిక్ ఎయిర్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రతే తమకు అత్యున్నత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతూ, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Next Story