- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో పాక్ ఎయిర్ స్ట్రైక్.. నలుగురు దుర్మరణం, 15 మందికి గాయాలు
పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్థాన్ సైన్యం శుక్రవారం వైమానిక దాడులకు (Air Strikes) దిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్- అమెరికా, ఇరాన్‌ల మధ్య వార్ జరుగుతున్న వేళ పాక్- అఫ్ఘాన్ మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్థాన్ సైన్యం శుక్రవారం వైమానిక దాడులకు (Air Strikes) దిగింది. రెండు దేశాల మధ్య తలెత్తిన తాజా ఘర్షణలతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కాబూల్ పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని కాబూల్‌లోని నివాస ప్రాంతాలపై జరిగిన ఈ బాంబు దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయపడ్డారని కాబూల్ పోలీసు ప్రతినిధి ఖలీల్ జద్రాన్ వెల్లడించారు. పాక్ దాడులు కేవలం కాబూల్‌కే పరిమితం కాలేదు. తాలిబన్ల సుప్రీం లీడర్ నివాసముండే దక్షిణ ప్రావిన్స్ కాందహార్‌తో పాటు, పాక్ సరిహద్దుల్లోని తూర్పు ప్రావిన్సులైన పక్టియా, పక్తికలలోనూ పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపారు.
ఉగ్రవాద స్థావరాలే లక్ష్యమా?
పాకిస్తాన్‌లో ఇటీవల పెరుగుతున్న ఉగ్రదాడుల వెనుక అఫ్ఘాన్ గడ్డపై తలదాచుకున్న ఉగ్రవాదుల హస్తం ఉందని ఇస్లామాబాద్ బలంగా విశ్వసిస్తోంది. 'తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్' (TTP) ఉగ్రవాద సంస్థే లక్ష్యంగా రాత్రికి రాత్రే ఈ దాడులు చేసినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పాక్ భద్రతా అధికారి ధృవీకరించారు. తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని పాక్ చెబుతోంది. పాక్ ఆరోపణలను తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు తావులేదని స్పష్టం చేసింది. ఇది తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని, దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు జాతీయ మీడియా ఎన్డీటీవీ స్పష్టం చేసింది.
ఐక్య రాజ్య సమితి ఆందోళన..
గత కొన్ని వారాలుగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల మరణాల సంఖ్యను స్వతంత్రంగా ధృవీకరించడం కష్టంగా ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి (UN) నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. UNAMA నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 మధ్య పాక్ సైనిక ఆపరేషన్ల కారణంగా అఫ్ఘాన్‌లో 24 మంది చిన్నారులు సహా 56 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లోని ఘర్షణల కారణంగా సుమారు 1,15,000 మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (UNHCR) వెల్లడించింది.






