ఒక్క ఫోన్ కాల్.. థాయ్ లాండ్ ప్రధాని సస్పెండ్

by Shamantha N |   (  Updated:2025-07-01 10:56:30  IST  )

థాయిలాండ్ న్యాయస్థానం ప్రధానమంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రపై నైతికత ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసింది.

ఒక్క ఫోన్ కాల్..  థాయ్ లాండ్ ప్రధాని సస్పెండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: థాయిలాండ్ న్యాయస్థానం ప్రధానమంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రపై నైతికత ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేసింది. కంబోడియా సెనేట్ అధ్యక్షుడు హున్ సేన్‌తో లీకైన ఫోన్ సంభాషణపై ఆమెపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. విచారణ పూర్తయ్యే వరకు ఆమెను అధికార బాధ్యతల నుంచి తొలగించాలని 7-2 ఓట్లతో తీర్పునిచ్చింది. తన నిర్దోషిత్వాన్ని సమర్థించుకునేందుకు కోర్టు పేటోంగ్‌టార్న్‌కు 15 రోజుల గడువు ఇచ్చింది.

ఏం చేసినా దేశ శాంతి కోసమే

మే 28న కంబోడియా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఒక కంబోడియా సైనికుడి మృతి నేపథ్యంలో కంబోడియా అధ్యక్షుడితో షినవత్ర ఫోన్ కాల్ మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె ప్రాదేశిక సైనిక అధికారిని విమర్శించినట్లు పేర్కొనబడటంతో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల నిరసనలు, రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో పార్టీలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఒకరు తప్పుకున్నారు. ప్రధానమంత్రి బాధ్యతల నుంచి తొలగించబడినప్పటికీ షినవత్ర తన చర్యలను సమర్థించుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దేశాన్ని శాంతియుతంగా ఉంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాజా పరిణామాల మధ్య ఉప ప్రధాని సూర్య తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. మరోవైపు జాతీయ అవినీతి నిరోధక కమిషన్ కార్యాలయం కూడా షినవత్ర పై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Next Story