Annamalai Temple: అన్నామలై ఆలయంలో నాన్‌వెజ్ తిన్న వ్యక్తి.. తర్వాత ఏమైందంటే

by Shamantha N |   (  Updated:2025-06-10 09:47:04  IST  )

తమిళనాడు తిరువణ్ణామలైలోని ప్రఖ్యాత అన్నామలై ఆలయం ప్రాంగణంలో ఓ వ్యక్తి నాన్ వెజిటేరియన్ భోజనం తినడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆలయంలోని నాలుగో ప్రహారంలో (బయటి ప్రాంగణం)లో చోటుచేసుకుంది. ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు అతడిని మాంసాహారం తింటుండగా చూశారు. దీంతో తక్షణమే ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు.

Annamalai Temple: అన్నామలై ఆలయంలో నాన్‌వెజ్ తిన్న వ్యక్తి.. తర్వాత ఏమైందంటే
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు తిరువణ్ణామలైలోని ప్రఖ్యాత అన్నామలై ఆలయం ప్రాంగణంలో ఓ వ్యక్తి నాన్ వెజిటేరియన్ భోజనం తినడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆలయంలోని నాలుగో ప్రహారంలో (బయటి ప్రాంగణం)లో చోటుచేసుకుంది. ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు అతడిని మాంసాహారం తింటుండగా చూశారు. దీంతో తక్షణమే ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అతడి వద్దకు వెళ్లి వివరాలు అడిగినప్పుడు తాను కేవలం ‘కుస్కా’ (సాదా బిర్యానీ) ఆర్డర్ చేశానని, పొరపాటుగా చికెన్ ముక్క అందులో వచ్చిందని చెప్పినట్లు సమాచారం. వెంటనే ఆలయ సిబ్బంది ఆ భోజనాన్ని అక్కడికక్కడే తొలగించి విషయం పోలీసులకు తెలియజేశారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో మాంసాహారం తినడం నిషేధం కావడంతో ఈ సంఘటన భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది.

గత జనవరిలో ఇదే తరహ ఘటన

ఇదే తరహాలో గత జనవరిలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. మదురైలోని తిరుపరాంకుంద్రం సుబ్రహ్మణ్యస్వామి కొండ ప్రాంతంలో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాస్ కాణీ నాన్‌వెజ్ తిన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత దురదృష్టకరం అన్నారు. పవిత్ర ప్రదేశంలో మాంసాహారం తినడం సరైన చర్య కాదన్నారు. ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నామలై వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వలన శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుంది అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనతో మత విశ్వాసాలపై గౌరవం, ఆలయ నిబంధనలు కట్టుబాటు వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.

Next Story