- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమాన సర్వీసులు నిలిపివేసిన స్పిరిట్ ఎయిర్ లైన్స్.. ఇంధన ధరలే కారణమా?

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ అల్ట్రా-లో-కాస్ట్ విమానయాన సంస్థ 'స్పిరిట్ ఎయిర్‌లైన్స్' (Spirit Airlines) తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. సుమారు 500 మిలియన్ డాలర్ల రెస్క్యూ డీల్ విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనివల్ల విమాన ప్రయాణ ధరలు భారీగా పెరగడమే కాకుండా, వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక ప్రధాన బడ్జెట్ ఎయిర్‌లైన్ మార్కెట్ నుండి తప్పుకోవడంతో సీట్ల లభ్యత తగ్గి, డిమాండ్ పెరగడం వల్ల విమాన ఛార్జీలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
సిబిఎస్ (CBS) న్యూస్ గణాంకాల ప్రకారం.. ఇప్పటికే విమాన ప్రయాణ ధరలు 23 శాతం మేర పెరిగాయి. అంటే ఒక రౌండ్ ట్రిప్‌పై సగటున 60 డాలర్ల అదనపు భారం పడుతోంది. గత మార్చిలో బాండ్ హోల్డర్లతో కుదుర్చుకున్న పునర్నిర్మాణ ఒప్పందం ద్వారా కంపెనీని గట్టెక్కించాలని భావించినప్పటికీ, ఇటీవల ఇంధన ధరలు (Fuel Prices) అసాధారణంగా పెరగడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని స్పిరిట్ ఏవియేషన్ హోల్డింగ్స్ సీఈఓ డేవ్ డేవిస్ తెలిపారు. సంస్థను కొనసాగించే ప్రత్యామ్నాయం లేకపోవడంతో దశలవారీగా మూసివేత ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రయాణికులకు ఊరట చర్యలు
స్పిరిట్ నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు యునైటెడ్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ వంటి ఇతర సంస్థలు ముందుకు వస్తున్నాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ కీలక మార్గాల్లో 'ఫేర్ క్యాప్స్' (ధరల పరిమితి) విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇతర విమానయాన సంస్థలు తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తన విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు.. ప్రయాణికులకు టికెట్ సొమ్మును తిరిగి చెల్లిస్తామని (Refunds) హామీ ఇచ్చింది.
రీఫండ్ ప్రక్రియ, సూచనలు
క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆటోమేటిక్ గా వారి ఖాతాల్లోకే నగదు జమ అవుతుందని సంస్థ తెలిపింది. అయితే.. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న వారు నేరుగా సంబంధిత ఏజెంట్లను సంప్రదించాల్సి ఉంటుంది. వోచర్లు, క్రెడిట్స్ లేదా రివార్డ్ పాయింట్ల ద్వారా బుక్ చేసిన వారికి బ్యాంక్రప్సీ (దివాలా) విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాతే రీఫండ్ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులు తమ ప్రయాణాల కోసం ఇతర విమానయాన సంస్థల్లో ముందస్తుగా రీబుకింగ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






