- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యుడి ఒడిలోకి నాసా ‘పార్కర్’ ప్రోబ్.. రహస్యాలను ఛేదించేందుకు పంపిన సోలార్ ప్రోబ్ రికార్డు!
సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు పంపిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ 2026, మార్చి 11న విజయవంతంగా తన 27వ ‘క్లోజ్ అప్రోచ్’ను పూర్తి చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతరిక్ష పరిశోధనల్లో నాసా (NASA) మరో మైలురాయిని అధిగమించింది. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు పంపిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ (Parker Solar Probe) 2026, మార్చి 11న విజయవంతంగా తన 27వ ‘క్లోజ్ అప్రోచ్’ను పూర్తి చేసింది. ఈ ప్రయాణంలో వ్యోమనౌక సూర్యుడి ఉపరితలానికి కేవలం 62 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది.
సూర్యుడికి అత్యంత చేరువగా..
భూమి సూర్యుడికి సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. అయితే, పార్కర్ ప్రోబ్ కేవలం 62 లక్షల కిలోమీటర్ల దూరంలోకి వెళ్లడం అంటే.. అది సూర్యుడి బాహ్య వాతావరణాన్ని స్పృశిస్తూ వెళ్లడమేనని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. 2018 ఆగస్టులో ప్రయోగించిన ఈ కారు పరిమాణంలో ఉండే వ్యోమనౌక, సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన మానవ నిర్మిత వస్తువుగా చరిత్రలో నిలిచింది.
ముంబై నుంచి ఢిల్లీకి 4 సెకన్లలోనే!
ఈ చారిత్రాత్మక ప్రయాణంలో పార్కర్ ప్రోబ్ గంటకు 6,92,017.92 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ వేగం ఎంతటిదంటే.. కేవలం 4 సెకన్ల లోపే ముంబై నుంచి ఢిల్లీకి చేరుకోవచ్చు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ అసాధారణ వేగం సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ పరిశోధన ఎందుకు ముఖ్యం?
సూర్యుడికి అత్యంత సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో, తీవ్రమైన ఉష్ణోగ్రత, రేడియేషన్ కారణంగా భూమితో కమ్యూనికేషన్ దాదాపు అసాధ్యం. దీంతో మార్చి 6 నుంచి 16 వరకు పార్కర్ ప్రోబ్ స్వయంప్రతిపత్తితో (Autonomously) పనిచేసింది. మార్చి 14న మేరీల్యాండ్‌లోని జాన్స్ హాప్కిన్స్ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీకి ‘బీకాన్ సిగ్నల్’ పంపి, తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు స్పష్టం చేసింది. సూర్యుడి ఉపరితలం కంటే దాని బాహ్య వాతావరణం ఎందుకు వేల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుంది? సౌర గాలులు (Solar Winds) ఎలా ఉద్భవిస్తాయి? వంటి చిక్కుముడులను విప్పడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం నాసా తెలిపింది. సూర్యుడి నుంచి వచ్చే సౌర జ్వాలలు (Solar Flares), కరోనల్ మాస్ ఎజెక్షన్ల వల్ల భూమిపై విద్యుత్ గ్రిడ్లు, ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పార్కర్ ఇచ్చే సమాచారం వీటిని ముందుగానే అంచనా వేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం సూర్యుడు తన అత్యంత క్రియాశీలక దశ (Solar Maximum)లో ఉన్నందున, పార్కర్ సేకరించే సమాచారం శాస్త్రవేత్తలకు ఎంతో కీలకం కానుంది. ఈ తాజా పర్యటనలో సేకరించిన డేటా మార్చి 18 నుంచి భూమికి చేరడం ప్రారంభమవుతుందని నాసా తెలిపింది.






