- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమిపైకి దూసుకొస్తున్న నాసా ఉపగ్రహం.. 14 ఏళ్ల ప్రయాణం తర్వాత ముగిసిన ‘వాన్ అలెన్’ ప్రస్థానం
అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA)కు చెందిన ‘వాన్ అలెన్ ప్రోబ్-ఏ’ (Van Allen Probe A) ఉపగ్రహం నేడు భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (NASA)కు చెందిన ‘వాన్ అలెన్ ప్రోబ్-ఏ’ (Van Allen Probe A) ఉపగ్రహం నేడు భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. సుమారు 600 నుంచి 700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం, భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి లేదా రేపు తెల్లవారుజామున (అమెరికా కాలమానం ప్రకారం మార్చి 10, రాత్రి 7:45 గంటలకు) భూమిపైకి దూసుకు రావచ్చని అమెరికా స్పేస్ ఫోర్స్ అంచనా వేస్తోంది.
ముగిసిన సుదీర్ఘ ప్రయాణం..
భూమి చుట్టూ ఉండే రేడియేషన్ బెల్టులపై (వాన్ అలెన్ బెల్టులు) అధ్యయనం చేయడం కోసం 2012, ఆగస్టు 30న నాసా రెండు జంట ఉపగ్రహాలను (ప్రోబ్ ఏ, ప్రోబ్ బీ) ప్రయోగించింది. కేవలం రెండేళ్ల కాలపరిమితితో వెళ్లిన ఈ ఉపగ్రహాలు, అంచనాలకు మించి ఏడేళ్ల పాటు (2019 వరకు) అద్భుతమైన డేటాను అందించాయి. 2019లో వీటి పనితీరు నిలిచిపోయింది. శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ఉపగ్రహం 2034 వరకు కక్ష్యలో ఉండాల్సింది. కానీ, ప్రస్తుతం సూర్యుడు తన గరిష్ట సౌర కార్యాచరణ దశలో (Solar Maximum) ఉండటంతో అంతరిక్ష వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీనివల్ల వాతావరణ ఘర్షణ (Atmospheric Drag) పెరిగి, ఉపగ్రహం అంచనా వేసిన దానికంటే ఎనిమిదేళ్ల ముందే భూమి వైపునకు పడిపోతోంది. దీంతో 14 ఏళ్ల ప్రయాణం తర్వాత ‘వాన్ అలెన్’ ప్రస్థానం ముగిసినట్లైంది.
ప్రమాదం పొంచి ఉందా?
భూ వాతావరణం లోకి ప్రవేశించే క్రమంలో ఏర్పడే తీవ్రమైన వేడి, ఘర్షణ కారణంగా ఉపగ్రహంలోని మెజారిటీ భాగం కాలి బూడిదవుతుందని నాసా వెల్లడించింది. అయితే, కొన్ని గట్టి భాగాలు మాత్రం భూమిని తాకే అవకాశం ఉన్నప్పటికీ, దీనివల్ల ప్రమాదం తక్కువగానే ఉంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహ గమనాన్ని నాసా, స్పేస్ ఫోర్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఇదే ప్రయోగంలో భాగంగా పంపిన రెండో ఉపగ్రహం (ప్రోబ్-బీ) ఇప్పటికీ కక్ష్యలోనే ఉందని, అది ఈ దశాబ్దం చివరలో భూమి వైపు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.






