Earthquake: భూప్రళయం!! వందలాది మంది దుర్మరణం

by Mahesh Kanagandla |

మయన్మార్‌ను భూ ప్రళయం కుదిపేసింది. శుక్రవారం ఉదయం సంభవించిన వరుస భూకంపాలు దేశాన్ని కాంక్రీట్ దిబ్బగా మార్చేశాయి. ఆకాశ హర్మ్యాలు గడ్డిపోచల్లా వణికిపోయాయి. బ్రిడ్జీలు, డ్యాములు కూలిపోయాయి. రోడ్లు నెర్రెలుబారాయి. ఈ శిథిలాల కింద పడి వందలాది మంది ప్రాణాలుకోల్పోయారు. భారీ భవంతుల కింద శవాల గుట్టలు వల్లకాడును తలపించాయి. అధికారికంగానే ఇక్కడ 144 మంది మరణించినట్టు చెప్పగా.. 181 మంది మరణించారని ఓ స్థానిక మీడియా సంస్థ రిపోర్ట్ చేసిం

Earthquake: భూప్రళయం!! వందలాది మంది దుర్మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌(Myanmar)ను భూ ప్రళయం కుదిపేసింది. శుక్రవారం ఉదయం సంభవించిన వరుస భూకంపాలు(Earthquake) దేశాన్ని కాంక్రీట్ దిబ్బగా మార్చేశాయి. ఆకాశ హర్మ్యాలు గడ్డిపోచల్లా వణికిపోయాయి. బ్రిడ్జీలు, డ్యాములు కూలిపోయాయి. రోడ్లు నెర్రెలుబారాయి. ఈ శిథిలాల కింద పడి వందలాది మంది ప్రాణాలుకోల్పోయారు. భారీ భవంతుల కింద శవాల గుట్టలు వల్లకాడును తలపించాయి. అధికారికంగానే ఇక్కడ 144 మంది మరణించినట్టు చెప్పగా.. 181 మంది మరణించారని(Death Toll) ఓ స్థానిక మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. పొరుగు దేశం థాయ్‌లాండ్‌(Thailand)నూ ఈ భూకంపాలు వణికించాయి. ఇక్కడ 30 అంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టమయింది. కనీసం 30 మంది మరణించినట్టు స్థానికులు చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.


మయన్మార్‌లో రెండో అతిపెద్ద నగరం, బౌద్ధ ఆరామాలతో ఆధ్యాత్మిక రాజధానిగా తులతూగిన మాండలే నగరం క్షణాల్లో శిథిలనగరంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం సుమారు 12.50 గంటల ప్రాంతం(భారత కాలమానంలో ఉదయం 11.50 గంటలు)లో ఈ నగరంలో రిక్టర్ స్కేల్ పై గరిష్టంగా 7.7 తీవ్రతతో భూమి కంపించింది. మాండలే సమీపంలో సగాయింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అంచనా వేశారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో ఆరుసార్లు భూమి వణికింది. రెండోసారి 6.4 తీవ్రతతో, అనంతరం, 5.9 తీవ్రతలతో.. ఇలా నిమిషాల వ్యవధిలోనే భూమి కంపించింది. ఈ సమయంలో నగరంలోని భారీ భవంతలు కదిలాయి. వాటిపైనున్న ఇన్ఫినిటీ పూల్స్ నుంచి నీరు కిందికిపడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. మాండలీ ఎయిర్‌పోర్టు ధ్వంసమైపోయింది. మయన్మార్‌లో పురాతనమైన సగాయింగ్ బ్రిడ్జీ కూలిపోయింది. మాండలీలో ప్రార్థనలు జరుగుతుండగా మసీదు కూలింది. అదే నగరంలోని ఓ యూనివర్సిటీలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. రాజధాని నగరం నేపీడాలోని ప్రధాన హాస్పిటల్‌కు డెడ్‌బాడీలు, క్షతగాత్రులతో సంబంధీకులు, రెస్క్యూ సిబ్బంది పోటెత్తారు. స్థానికులు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు. రోడ్లూ నెర్రలుబారుతుండటంతో భీతిల్లారు.

నష్టం అంచనాకే వారం పడుతుంది..

మయన్మార్ భూకంపానికి 144 మంది మరణించినట్టు అధికారిక మీడియాలో అధికారులు వెల్లడించారు. 700ల మందికిపైగా గాయపడినట్టు వివరించారు. ఇందులో నేపీడాలో 96 మంది, సగాయింగ్‌లో 18 మంది, మాండలేలో 30 మంది మరణించినట్టు తెలిపారు. ఇక నేపీడాలో 132 మంది, సగాయింగ్‌లో 300 మంది మరణించినట్టు మిలిటరీ అధికారులు చెప్పారు. ఇప్పటికిప్పుడే భూకంప నష్టాన్ని అంచనా కట్టలేమని, ఈ అంచనాకు వారం రోజులు పట్టొచ్చని రెస్క్యూ మినిస్టర్ తెలిపారు. కాగా, స్థానిక మీడియా ప్రకారం, మృతుల సంఖ్య 200కు అటూఇటుగా ఉన్నాయి. వేలాదిగా గాయపడ్డారు.

థాయ్‌లాండ్‌లో ౩౦ మంది మృతి

మయన్మార్‌లో భారీ భూకంపం చోటుచేసుకోగా.. పొరుగునే ఉన్న థాయ్‌లాండ్‌లో దాని ప్రభావం తీవ్రంగా పడింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవంతలు నేలమట్టమయ్యాయి. 30 అంతస్తుల నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ క్షణాల్లో నేలమట్టమైంది. బ్యాంకాక్‌లో ఓ భవన శిథిలాల కింది నుంచి 30డెడ్‌బాడీలను వెలికి తీసినట్టు సహాయకచర్యల్లో పాల్గొన్న ఓ వ్యక్తి వెల్లడించారు. కాగా, 80 మందికిపైగా గాయపడినట్టు కథనాలు వచ్చాయి.

భారత్‌లోనూ ప్రకంపనలు

థాయ్‌లాండ్‌తోపాటు భారత్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోనూ ఈ భూకంప ప్రకంపనలు వచ్చాయి. అయితే, ఈ దేశాల్లో ప్రాణనష్టం జరగలేదు. భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలు సహా కోల్‌కతాలో స్వల్పంగా భూమి కంపించింది. బంగ్లాదేశ్‌లోనూ భూప్రకంపనలు వచ్చాయి.

ఒకవైపు అంతర్యుద్ధం.. ఆపై భూకంపం

2021 నుంచి మయన్మార్ అంతర్యుద్ధంతో నలిగిపోతున్నది. ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని ఆర్మీ తిరుగుబాటతో కూల్చేసిన తర్వాత ఇక్కడి పరిస్థితులు దిగజారాయి. ప్రజాస్వామ్య గొంతుకలు, మానవ హక్కులను సైనిక ప్రభుత్వం కాలరాసింది. మిలిటరీ పాలనలో ఉన్నా.. పలుచోట్లపై నియంత్రణను కోల్పోగా.. స్థానికంగా సాయుధ బలగాలు పవర్ కోసం దాడులు చేసుకుంటున్నాయి. ఇలాంటి చోట సహాయక చర్యలూ ప్రమాదకరంగానే ఉన్నాయి. వరుస సైనిక పాలనతో దేశంలో పేదరికం దాదాపు 49 శాతానికి చేరింది. నిరంతరం శ్రమిస్తూ దాదాపు 25 శాతం మంది ప్రజలు మాత్రమే పేదరికం వెలుపల ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వైద్య సదుపాయాలు, కనీస సౌకర్యాలు కష్టంగా మారిపోయాయి. ఇలాంటి చోట తీవ్ర భూకంపం సంభవించడంతో ప్రజలకు దెబ్బమీదదెబ్బ పడినట్టుగా ఉన్నది.

సహాయం అందించడానికి రెడీ

మయన్మార్‌లో సైనిక పాలనే ఉన్నప్పటికీ భూకంప తీవ్రత కారణంగా ఆర్మీ చీఫ్ సహాయ హస్తం అందించాలని కోరారు. దీంతో ప్రపంచ దేశాలు సానుకూలంగా స్పందించాయి. జర్మనీ, నెదర్లాండ్స్ వంటి యూరప్ దేశాలు ముందుకు వచ్చినట్టు యూనిసెఫ్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సహాయం అందిస్తామని ప్రకటించారు. భారత్ కూడా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ అక్కడి పరిస్థితులను కేంద్ర విదేశాంగ శాఖ నిత్యం పర్యవేక్షిస్తుందని వివరించారు.

Next Story