చైనాలో భారీ అగ్నిప్రమాదం: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలో చెలరేగిన మంటలు

by Ramesh Naini |

చైనాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బీవైడీ’కి చెందిన షెన్‌జెన్‌లోని పార్కింగ్ గ్యారేజీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

చైనాలో భారీ అగ్నిప్రమాదం: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలో చెలరేగిన మంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బీవైడీ’ (BYD)కి చెందిన షెన్‌జెన్‌లోని పార్కింగ్ గ్యారేజీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పింగ్‌షాన్ జిల్లాలోని బీవైడీ క్యాంపస్‌లో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.

బ్యాటరీల లోపం కాదు.. నిర్మాణ పనుల వల్లే!

స్క్రాప్ (తుక్కు), టెస్టింగ్ కోసం ఉంచిన వాహనాల పార్కింగ్ ఏరియాలో ఈ మంటలు చెలరేగాయని సంస్థ వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదానికి ఈవీ బ్యాటరీల లోపం గానీ, వాహనాలు వాటంతట అవే కాలిపోవడం (Self-ignition) గానీ కారణం కాదని బీవైడీ సంస్థ స్పష్టం చేసింది. పార్కింగ్ వెలుపల జరుగుతున్న నిర్మాణ పనుల్లోని లోపాల వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కస్టమర్ల వాహనాలకు నష్టం జరగలేదు

ఈ ప్రమాదం వల్ల ఫ్యాక్టరీ ప్రధాన ఉత్పత్తి కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, రోజువారీ కార్యకలాపాలకు సైతం ఎలాంటి అంతరాయం కలగలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్‌లోకి రానున్న కొత్త వాహనాలకు, కస్టమర్ల వాహనాలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఈవీల భద్రత పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం బయట జరిగిన ఒక ప్రమాదం మాత్రమేనని అధికారులు, బీవైడీ యాజమాన్యం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story