- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమోవాలో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు
పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. శుక్రవారం ఉదయం దక్షిణ పసిఫిక్ మహా సముద్రం (South Pacific Ocean) రీజియన్‌లోని సమోవా (Samoa) సమీపంలో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా రికార్డు అయినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఒక్కసారిగా భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో.. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సముద్రంలో ఇంత భారీ ఎత్తున భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందని కూడా భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. అయితే భూకంప కేంద్రం సమోవా రాజధాని అపియా నగరానికి నైరుతి దిశగా 440 కిలోమీటర్ల దూరంలో 314 కిలోమీటర్ల లోతులో ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదని అధికారులు తెలిపారు.
కాగా, సమోవా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. సమోవా ద్వీప సమూహం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల భూకంపాలు సాధారణం, కానీ ఈ స్థాయి తీవ్రత అరుదుగా నమోదవుతుంది. 2009లో సమోవా- అమెరికన్ సమోవా మధ్య రెండు భారీ భూకంపాలు సంభవించాయి. దీంతో సునామీ సైతం ఏర్పడింది. సునామీ బారిన పడి అప్పట్లో సమోవా, అమెరికన్ సమోవా, టోంగాల్లో 192 మంది మరణించారు. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో భూమి కంపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.






