జపాన్‌లో భారీ భూకంపం: 7.4 తీవ్రతగా నమోదు

by Dishanational2 |
జపాన్‌లో భారీ భూకంపం: 7.4 తీవ్రతగా నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూ ఇయర్‌లో తొలి రోజే జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమానం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 12:40 గంటల నుంచి 90 నిమిషాల వ్యవధిలోనే పశ్చిమ ప్రాంతంలో 21 భూకంపాలు సంభవించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇందులో 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం.. తీవ్ర ప్రభావం చూపింది. దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీచేసింది. తక్షణమే ఎగువ ప్రాంతాల్లోకి పరుగులు తీయాలంటూ అలెర్ట్ చేసింది. ఇషికావా, నీగాటా, టొయామా, తీర ప్రాంతాలలో అలలు ఐదడుగుల ఎత్తులో ఎగిసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి, ఇళ్లలోకి నీరు చేరింది. భూకంపం ధాటికి పలు చోట్ల రోడ్లు, భవనాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో 33,500 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అప్రమత్తమైన స్థానిక ప్రభుత్వం.. ప్రమాదకర ప్రాంతాల్లో రోడ్లను మూసివేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు, అక్కడి భారత రాయబార కార్యాలయం సైతం తక్షణమే స్పందించి ఎమెర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాయంత్రం వరకల్లా సముద్రం శాంతించడంతో జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలను రద్దు చేసింది. భారీ అలల ముప్పు తప్పినప్పటికీ, ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్నందునా అప్రమత్తంగా ఉండాలన్న అడ్వైజరీని అలానే ఉంచింది. కాగా, భూకంపం ధాటికి భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పటికీ, అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఎక్కడా జరగలేదని సమాచారం. పలువురికి స్వల్ప గాయాలైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.


Next Story

Most Viewed