కర్ణాటకలో లోకాయుక్త అధికారుల లంచాల వసూలు

by Shamantha N |

కర్ణాటకలోని అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త స్వయంగా తన సిబ్బందిలో ఇద్దరు అధికారులపై లంచం, మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది.

కర్ణాటకలో లోకాయుక్త అధికారుల లంచాల వసూలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త స్వయంగా తన సిబ్బందిలో ఇద్దరు అధికారులపై లంచం, మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. లోకాయుక్త కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనాథ్ జోషి , కానిస్టేబుల్ నింగప్ప‌లు ఎక్సైజ్ శాఖ, బృహన్ బెంగళూరు మున్సిపల్ (BBMP) అధికారుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసినట్లు లోకాయుక్త ప్రెస్ నోట్ విడుదల చేసింది. వీరు డబ్బులు వసూలు చేసేందుకు ‘KG’ అనే కోడ్‌వర్డ్ ను యూజ్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీనాథ్ జోషి క్రిప్టోకరెన్సీ ద్వారా లంచంగా తీసుకున్న డబ్బుల్ని వైట్ మనీగా మార్చేందుకు 24 క్రిఫ్టో అకౌంట్స్ ఓపెన్ చేసినట్లు, వాటిలో 13 ఖాతాల్లో ఇప్పటికే రూ.4 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

అధికారుల విశ్వసనీయతపై ఆందోళన

ఈ సంఘటన లోకాయుక్తలోనే అంతర్గత అవినీతి గురించి ఆందోళనలను రేకెత్తించింది. గతంలో లోకాయుక్త తన సిబ్బందిని పర్యవేక్షించడానికి 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక విజిలెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని అధికారికంగా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ అంశం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పరిపాలనా పారదర్శకత, విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. తాజా ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థలో పారదర్శకత, నమ్మకం తీసుకురావడానికి, అవినీతి నిరోధక బ్యూరో (ACB) నుంచి బదిలీ అయిన సిబ్బందిని మళ్లీ లోకాయుక్తకు అప్పగించి, అంతర్గత నిఘా యంత్రాంగాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Next Story