26 ఏళ్ల తర్వాత లెబనాన్‌ ‘బ్యూఫోర్ట్‌’ కోటపై ఇజ్రాయెల్ జెండా.. వ్యూహాత్మక ప్రాంతం వశం

by Ramesh Naini |

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు భారీ ముందడుగు వేశాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, వ్యూహాత్మక రిడ్జ్ పర్వతంపై ఉన్న చారిత్రక ‘బ్యూఫోర్ట్ కోట’ను ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమించుకుంది.

26 ఏళ్ల తర్వాత లెబనాన్‌ ‘బ్యూఫోర్ట్‌’ కోటపై ఇజ్రాయెల్ జెండా.. వ్యూహాత్మక ప్రాంతం వశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు భారీ ముందడుగు వేశాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, వ్యూహాత్మక రిడ్జ్ పర్వతంపై ఉన్న చారిత్రక ‘బ్యూఫోర్ట్ కోట’ను (Beaufort Castle) ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమించుకుంది. గత 26 ఏళ్లలో లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ ఇంత లోతుగా చొచ్చుకుపోవడం ఇదే తొలిసారి. కోటను స్వాధీనం చేసుకున్న అనంతరం అక్కడ ఇజ్రాయెల్ జెండాను ఎగురవేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సామాజిక మాధ్యమం ద్వారా ధృవీకరించారు.

చర్చల ముందే దాడులు..

అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 17 నుంచి ఇరుపక్షాల మధ్య నామమాత్రపు కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ఈ ఆక్రమణ చోటుచేసుకుంది. జూన్ 2, 3 తేదీలలో వాషింగ్టన్‌లో శాంతి చర్చల తదుపరి రౌండ్ జరగాల్సి ఉన్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 1982లో ఈ కోటను ఆక్రమించిన ఇజ్రాయెల్, సుదీర్ఘ కాలం తమ ఆధీనంలో ఉంచుకుని 2000 సంవత్సరంలో అక్కడి నుంచి వైదొలిగింది. మళ్లీ 26 ఏళ్ల తర్వాత ఈ కోట ఇజ్రాయెల్ వశమైంది.

సైనిక వ్యూహం.. విస్తరిస్తున్న పోరాట జోన్

ఈ కోటను స్వాధీనం చేసుకోవడం ద్వారా దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్‌ ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యానికి పూర్తి నిఘా ఉంచే వీలు కలుగుతుంది. గతంలో ఇక్కడి నుంచే ఇజ్రాయెల్ నివాసిత ప్రాంతాలపై దాడులు జరిగేవని సైన్యం పేర్కొంది. ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు తమ కార్యకలాపాలను విస్తరించాయి. లిటాని నదిని దాటి ముందుకు సాగుతున్న సైన్యం, జహ్రానీ నది వరకు ఉన్న ప్రాంతాన్ని ‘పోరాట జోన్‌’గా ప్రకటించింది. ప్రస్తుతం వ్యూహాత్మక నబాతియే నగరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్ సైన్యం మోహరించింది. నబాతియేతో పాటు లెబనాన్ నాల్గవ అతిపెద్ద తీరప్రాంత నగరమైన ‘టైర్’ (Tyre) నివాసితులను కూడా తక్షణమే సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

భారీగా ప్రాణనష్టం

మార్చి 2న ప్రారంభమైన ఈ తాజా ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధంలో ఇప్పటివరకు లెబనాన్‌లో 3,350 మందికి పైగా మరణించగా, 10 లక్షల మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారని అంతర్జాతీయ మీడియా సమాచారం. మరోవైపు హిజ్బుల్లా జరిపిన డ్రోన్ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 25 మంది సైనికులు, ఇద్దరు పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ తాజా ఆక్రమణపై హిజ్బుల్లా లేదా లెబనాన్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Next Story