ఇజ్రాయెల్-అమెరికా దాడులు.. ఇరాన్‌లో 1900 దాటిన మృతుల సంఖ్య

by Ramesh Naini |

ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదవుతోందని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి.

ఇజ్రాయెల్-అమెరికా దాడులు.. ఇరాన్‌లో 1900 దాటిన మృతుల సంఖ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల కారణంగా ఇరాన్‌లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా నమోదవుతోందని అక్కడి మీడియా సంస్థలు చెబుతున్నాయి. తాజాగా ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,937కు చేరగా, ఇందులో 240 మంది మహిళలు, 212 మంది చిన్నారులు ఉన్నారు. మరో 24,800 మందికి పైగా గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఇరాన్ వ్యాప్తంగా దవాఖానాలు, నివాసాలతో సహా సుమారు 82,000 పౌర భవనాలు ధ్వంసమైనట్లు నివేదికలు చెబుతున్నాయి.

లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబాటు

లెబనాన్‌లో మృతుల సంఖ్య దాదాపు 1,100కి చేరుకుందని అంతర్జాతీయ మీడియా ద్వారా నివేదికలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు సరిహద్దులు దాటి లిటానీ నదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు చెందిన 18 మంది పౌరులు, నలుగురు సైనికులు మరణించగా, గల్ఫ్ ప్రాంతంలో 13 మంది అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సమాచారం.

ఏప్రిల్ 6 వరకు ట్రంప్ డెడ్‌లైన్

అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్‌ జలసంధి’ని ఇరాన్ దిగ్బంధించిన విషయం తెలిసిందే. దీనిని తిరిగి తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. పరిస్థితి చక్కబడకపోతే ఇరాన్ ఇంధన కర్మాగారాలను ధ్వంసం చేస్తామని ఆయన అల్టిమేటం జారీ చేశారు. అలాగే హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించేందుకు నౌకల నుంచి ఇరాన్ చట్టవిరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తోందని గల్ఫ్ దేశాల మండలి (GCC) ఆరోపించింది. మరోవైపు కువైట్ పోర్టుపైనా డ్రోన్ దాడులు జరిగాయి. యుద్ధం వల్ల లక్షలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని, భయంకరమైన ఆర్థిక, మానవతా సంక్షోభం తలెత్తుతోందని నార్వేజియన్ రిఫ్యూజీ కౌన్సిల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Next Story