ఆయిల్‌ కోసమే యుద్ధమా? మదురో అరెస్ట్‌ను తప్పుబట్టిన కమలా హారిస్‌

by Ramesh Naini |

వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న చర్యలను యూఎస్‌ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తీవ్రంగా విమర్శించారు.

ఆయిల్‌ కోసమే యుద్ధమా? మదురో అరెస్ట్‌ను తప్పుబట్టిన కమలా హారిస్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ అరెస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న చర్యలను యూఎస్‌ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యలు డ్రగ్స్‌ లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, పూర్తిగా ఆయిల్‌ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. ఆదివారం ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదికగా స్పందించిన కమలా హారిస్‌, ట్రంప్‌ చర్యలు అమెరికాను సురక్షితంగా ఉంచవని స్పష్టం చేశారు. బలవంతపు పాలన, మార్పు ప్రయత్నాలు ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తాయని, అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మదురో ఒక క్రూరమైన నియంత

‘మదురో ఒక క్రూరమైన, చట్టబద్ధత లేని నియంత అన్న విషయం నిజమే. అయితే దీనిని అడ్డం పెట్టుకుని ట్రంప్‌ తీసుకున్న ఈ చర్య చట్టవిరుద్ధమైనదే కాకుండా అవివేకపూరితమైంది. పాలన మార్పు లేదా ఆయిల్‌ కోసం చేసే యుద్ధాలు మొదట బలంగా కనిపించినా, చివరకు అవే అరాచకాలకు దారితీస్తాయి. ఆ భారాన్ని చివరికి అమెరికా కుటుంబాలే మోస్తాయి’ అని హారిస్‌ తెలిపారు. అమెరికా ప్రజలు ఇలాంటి సైనిక చర్యలకు మద్దతు ఇవ్వడం లేదని, ట్రంప్‌ వారిని మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ‘ఇది డ్రగ్స్‌ గురించి కాదు, ప్రజాస్వామ్యం గురించి కాదు. ఇది ఆయిల్‌ గురించి, అలాగే ప్రాంతీయ ‘స్ట్రాంగ్‌మ్యాన్‌’లా వ్యవహరించాలన్న ట్రంప్‌ ఆకాంక్ష’ అని హారిస్‌ మండిపడ్డారు. ఈ ఆపరేషన్‌కు సరైన చట్టపరమైన అనుమతి లేదని, స్పష్టమైన ప్రణాళిక కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఆమె అన్నారు. ‘సైనికులను ప్రమాదంలోకి నెట్టడం, బిలియన్ల డాలర్లు ఖర్చు చేయడం, ఒక ప్రాంతాన్ని అస్థిరం చేయడం తప్ప దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు’ అని హారిస్‌ స్పష్టం చేశారు.

వెనిజువెలాలో 303 బిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు

వెనిజువెలాపై అమెరికా దాడి అనంతరం ట్రంప్‌ తన మార్‌-ఏ-లాగో నివాసంలో మీడియాతో మాట్లాడారు. వెనిజువెలాలోని అపారమైన చమురు వనరులపై అమెరికా నియంత్రణ చేపడుతుందని ప్రకటించారు. దేశంలోని ఆయిల్‌ రంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రముఖ అమెరికన్‌ ఆయిల్‌ కంపెనీలను అక్కడికి పంపిస్తామని తెలిపారు. యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ గణాంకాల ప్రకారం వెనిజువెలాలో సుమారు 303 బిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద నిర్ధారిత చమురు నిల్వలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. ఈ వనరులే దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.

Next Story