ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతోందా?

by Shamantha N |   (  Updated:2025-06-17 07:32:12  IST  )

ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు తోడుగా అమెరికా కూడా సై అంటోంది. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి అర్థంతరంగా అమెరికా వచ్చేసిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇరాన్ పై అమెరికా దాడి చేయబోతోందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు తోడుగా అమెరికా కూడా సై అంటోంది. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి అర్థంతరంగా అమెరికా వచ్చేసిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయిల్ కు సాయం అందించేందుకు అమెరికా రెడీ అవుతోంది. నటంజ్ లోని భూగర్భ కేంద్రంలో అణ్వస్త్ర తయారీ చేపడుతున్న ఇరాన్ ను నిలువరించేందుకు ఇదే సరైన సమయమని అగ్రరాజ్యం భావిస్తోంది. ఇరాన్ పై ఎలా దాడి చేయాలి? ఇజ్రాయిల్ కు ఏ విధంగా సహకరించాలి. ఇరాన్ ను అణ్వస్త్ర దేశంగా మారకుండా ఎలా నిలువరించాలని అనే దానిపై కసరత్తు చేస్తోంది. అగ్నికి అజ్యం పోసినట్లు ఇజ్రాయిల్ కు తోడుగా అమెరికా వస్తే ఇక ఇరాన్ కోలుకోవడం కష్టం. యుద్ధాన్ని ఆపాలని ఆయా దేశాలు అమెరికాను కోరుతుంటే ట్రంప్ మాత్రం ఇరాన్ అణ్వస్త్ర ప్రోగ్రాంను ఆపేస్తేనే సాధ్యమని ప్రకటిస్తున్నారు.

అత్యంత పటిష్టంగా.. భూగర్భంలో అణ్వస్త్ర కేంద్రాలు

ఇరాన్ అణ్వస్త్రాల తయారీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని కోసం కొన్ని సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేస్తుంది. అణ్వస్త్రాల తయారీ, యూరేనియం శుద్ధి ప్రోగ్రాం చివరి దశకు చేరుకుంది. ఒక వేళ ప్రయోగం సక్సెస్ అయితే ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో ఇరాన్ కు తిరుగుండదు. ముఖ్యంగా యూదు దేశం అయినా ఇజ్రాయిల్ పై మొదటగా అణ్వస్త్రాన్ని ప్రయోగించడానికి ఇరాన్ ఏ మాత్రం ఆలోచించదు. దీంతో పక్కా ఇన్ఫర్మేషన్ అందుకున్నాక ఇజ్రాయిల్ దాడులు స్టార్ట్ చేసింది. అణ్వస్త్ర స్థావరాలే లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. అత్యంత కచ్చితత్వంతో దాడులు చేస్తున్నప్పటికీ ఇరాన్‌లోని అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధిపతి రఫాలే గ్రూసీ తెలపడం ఇప్పుడు ఆందోళనకు దారి తీసింది.

అణ్వస్త్ర కేంద్రాన్ని తుదముట్టించాలని..

నతాంజ్‌, ఫార్దో న్యూక్లియర్ ప్లాంట్ లను భూమి లోపల నిర్మించారు. వీటిని పేల్చేయాలంటే జీబీయూ-57 బంకర్ బ్లాస్టర్‌ బాంబులు అవసరం పడతాయి. ఇవి కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో పైపైనే దెబ్బతింటాయి. కానీ భూమి అంతర్భాగంలో ఉన్న ప్రయోగశాలలకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. దీంతో ఈ సారి అమెరికా నేరుగా రంగంలోకి దిగాలని యోచిస్తోంది. కాల్పుల విరమణ కాదు అంతకు మించి ఏదో జరగబోతుంది అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బంకర్ బ్లాస్టర్ బాంబులతో అమెరికా ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్ లపై దాడికి రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటిని ప్రయోగించేందుకు కావాల్సిన విమాన వాహన నౌకలను, యుద్ధ నౌకల్ని పశ్చిమాసియా ప్రాంతాలకు అమెరికా తరలిస్తోంది.


Also Read..

సంచలన పరిణామం.. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

Next Story