BIG BREAKING: సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఇరాన్ మీడియా

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-01 02:06:48  IST  )

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లు ఆ దేశ మీడియా ధృవీకరించింది.

BIG BREAKING: సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఇరాన్ మీడియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (86) మృతి చెందినట్లు ఆ దేశ మీడియా అధికారికంగా ధృవీకరించింది. అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వెల్లడించింది. ఖమేనీ కుటుంబ సభ్యులు నలుగురు మరణించినట్లు కూడా ఇరాన్ మీడియా ప్రకటించింది. ఖమేనీ కూతురు, అల్లుడు, కోడలు, మనుమడు చనిపోయినట్లు పేర్కొంది. అమెరికా - ఇజ్రాయెల్ చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్లో ఖమేనీ ఇంటిపై ఏకంగా 30 బాంబులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని, అగ్రనేతలంతా ఒకే దగ్గర ఉన్నప్పుడు విరుచుకుపడిందని ఇరాన్ మీడియా చెబుతోంది. ఇరాన్ మీడియా కంటే ముందే నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖమేనీ మరణించారని, తమ నిఘా నుంచి తప్పించుకోలేరని ప్రకటించారు. ఖమేనీ మరణం పట్ల ఇరాన్ ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఆయన మృతికి 40 రోజులపాటు సంతాప దినాలను ప్రకటించింది. 7 రోజులపాటు జాతీయ సెలవులను ప్రకటించారు.

శనివారం రాత్రి ఖమేనీ ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిగాయి. ఖమేనీ తన కార్యాలయంలో దేశ అగ్రనాయకులతో ఉన్నతస్థాయి సమావేశంలో ఉన్న సమయంలో బాంబుల దాడి జరగ్గా.. ఆయనతో పాటు పలువురు ఉన్నతస్థాయి సైనిక అధికారులు కూడా మరణించినట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడం, అక్కడి పాలనలో మార్పు తీసుకురావడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని అమెరికా పేర్కొంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ తదుపరి 'సుప్రీం లీడర్' ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతానికి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ కొత్త నాయకుడిని ఎన్నుకోవలసి ఉంది.

Next Story